ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- October 14, 2026
హైదరాబాద్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? రోడ్డుపై వాహనం నడుపుతూ ఫోన్లో వీడియోలు చూడటం, చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకోవడం వంటి ప్రమాదకర అలవాట్లు ప్రయాణికుల ప్రాణాలను ముప్పులోకి నెడుతున్నాయి. తాజాగా ఓ ఆటో డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డ్రైవింగ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయంలో రెండు ఫోన్లను ఉపయోగిస్తూ, హెడ్ఫోన్లు ధరించినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్ఫోన్లు. ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం అంటూ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల ప్రాణాలతో ఆటలొద్దు..
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం. ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి అంటూ సజ్జనార్ డ్రైవర్లకు సూచించారు.
వెంటనే కాల్ చేయండి..
వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకమన్న సజ్జనార్.. ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆటో, కారు, బైక్ ఇలా ఏ వాహనం అయినా.. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదం.. వెంటనే ప్రశ్నించండి, వారించండి. మీరు చెప్పినా ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి అంటూ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు.
ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలని ప్రయాణికులను సజ్జనార్ అప్రమత్తం చేశారు. ఈ పోస్టుకు ఫోన్లు చూస్తూ.. హెడ్ ఫోన్లు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్న ఆటో డ్రైవర్ వీడియోను పోస్టు చేశారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







