భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్..
- October 23, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగుల్లో లైసెన్సులు జారీ చేయాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహన నిబంధనల సవరణకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొత్త విధానం అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సుపై వాహనదారుడి జాతీయతను కూడా స్పష్టంగా ముద్రించనున్నారు.
నోటరీ అఫిడవిట్లకు ఇకపై అనుమతి లేదా.. ఆధార్‌కు ప్రాధాన్యం
డ్రైవింగ్ లైసెన్సుల జారీలో నకిలీ పత్రాలను అరికట్టి, ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం పలు మార్పులను ప్రతిపాదించింది. వయసు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ అఫిడవిట్లు, జీవిత బీమా పాలసీలను ఇకపై అంగీకరించకూడదని సూచించింది. వీటికి బదులుగా ఆధార్, ఓటర్ ఐడీ, ఈ-రేషన్ కార్డు, ఇటీవల జారీ చేసిన విద్యుత్ లేదా గ్యాస్ బిల్లులను గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని ప్రతిపాదించింది.
రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన పెంచేందుకు ఆన్‌లైన్ సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు ఉండనుంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా డ్రైవింగ్ లైసెన్సుపై బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలను ముద్రించాలని సూచించింది. ఆధార్ అథెంటికేషన్ ద్వారా వివరాలను మార్చుకునే వారికి ఫీజు మినహాయింపు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.
దరఖాస్తుల పరిష్కారానికి గడువు
డ్రైవింగ్ లైసెన్సులో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను 15 రోజుల్లోగా, చిరునామా మార్పు దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రతిపాదించారు. చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా అధికారులు నిర్ణయం తీసుకోకపోతే, దానిని ఆమోదించినట్లుగా పరిగణించే నిబంధనను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ మార్పులు ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది మార్గదర్శకాలను ప్రకటించనుంది.
తాజా వార్తలు
- భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్..
- అమెరికా వర్క్ వీసా నిబంధనల పై మార్కో రూబియో వివరణ
- ప్రాంతీయ అంతరాయాలు.. నవంబర్ 5 వరకు సౌదీ అరేబియా విమానాలను రద్దు చేసిన ఎతిహాద్
- టిబెట్‌లో 7.0 తీవ్రతతో భూకంపం...
- ఒమన్‌లో నవంబర్‌లో 4 రోజుల జాతీయ దినోత్సవ సెలవులు..!
- యూఏఈలో భారీ వర్షాలు.. దుబాయ్ ముందస్తు చర్యలు..!!
- ప్రిస్క్రిప్షన్ల పరిశీలన, మందుల భద్రత ఫార్మసిస్టర్ల బాధ్యతలు..!!
- డెలివరీ బైక్‌లపై కువైట్‌లో ట్రాఫిక్ శాఖ కొరడా..!!
- భారత రాయబారితో భారతి అసోసియేషన్ ప్రతినిధుల భేటీ..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై ఖతార్ ప్రధాని, అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..!!







