సినిమా రివ్యూ: ‘#కల్ట్’

- October 30, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘#కల్ట్’

హీరో విశ్వక్ సేన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపై హీరోయిజం చూపించగలడు. తెర వెనుక డైరెక్షన్ అలాగే మిగిలిన విభాగాల్లోనూ పట్టున్న టాలెంట్ వున్నోడు. గతంలో ‘దాస్ కా ధమ్కీ’, ‘ఫలక్‌నుమా దాస్’ వంటి సినిమాల్ని సొంత డైరెక్షన్‌లో తెరకెక్కించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు మళ్లీ ఇంకోసారి ‘#కల్ట్’ మూవీతో సొంత డైరెక్షన్‌లో మన ముందుకొచ్చాడు. గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కి జోడీగా నటించింది. మరి, ముచ్చటగా మూడో సారి సొంత డైరెక్షన్‌లో వచ్చిన సినిమా విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఎలా వుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్నట్లు ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాదు.. అని విశ్వక్ ముందే హెచ్చరించాడనుకోండి.! 

కథ:
ఈ సినిమా మొత్తం గోవా వీధుల్లో గిర్రా గర్రా తిరుగుతుంటుంది. గోవా అంటే డ్రగ్స్, మాఫియా గ్యాంగ్స్, స్మగ్లింగ్స్.. ఇవే గుర్తొస్తాయ్. ఆ నేపథ్యంలోనే మధ్యం, డ్రగ్స్, మాఫియా వీటినే తన కథా వస్తువుగా ఎంచుకున్నాడు విశ్వక్ ‌సేన్. వాటికి ‘స్క్విడ్ గేమ్’ తరహాలో ఓ గేమ్‌ని యాడ్ చేశాడు. అసలు కథలోకి వెళితే, గోవా మినిస్టర్ (మురళీ శర్మ) కొడుకు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన బర్గ్ ‌డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. అయితే, తన రాజకీయ జీవితానికి ఎలాంటి మచ్చ రాకుండా లిమిట్స్‌లో చేసుకోవాలని తండ్రి ఆదేశిస్తాడు. కానీ, ఎల్విన్ అదేమీ పట్టించుకోకుండా పార్టీలో మధ్యం, డ్రగ్స్ ఏరులై పారేలా పార్టీ అరేంజ్ చేస్తాడు. అంతా బాగానే వుంటుంది. అందరూ తాగుతూ, తుళ్లుతూ పార్టీ ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్‌గా డిజిటల్ స్క్రీన్‌పై ఓ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య పార్టీలో ఇలాంటివి కూడా సహజమే కదా.. గేమ్స్ గట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా.. అలాగే అనుకుంటారు పార్టీలో అంతా. మ్యూజికల్ చైర్స్‌తో ఈ గేమ్ చాలా సాధారణంగా స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ ఆగిపోగానే దొరికిన ఛైర్ చూసుకుని కూర్చోవాలని ఆ స్క్రీన్ నుంచి మాటలు వినిపిస్తాయ్. అయితే, కొంత మంది లైట్ తీసుకుంటారు. చిన్న పిల్లల ఆట ఇది అని వేలాకోలం చేస్తూ చైర్స్‌లో కూర్చోరు. అలా కూర్చోని వాళ్లు అత్యంత కిరాతకంగా హత్య చేయబడతారు. అది చూసి పార్టీలో అంతా భయపడిపోతారు. అదే పార్టీలో వున్న డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఈ అగంతకుల ఆగడాల్ని ఎలా కనిపెట్టాడు.? వారిని ఎలా అంతమొందించాడన్నదే ‘కల్ట్’ మూవీ కథ: ఇది మాత్రం ధియేటర్స్‌లోనే చూడాలి.

నటీనటుల పనితీరు:
విశ్వక్ సేన్ డీఎస్పీ పాత్రలో తనదైన సెటిల్డ్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. అయితే, రెండు పడవల ప్రయాణం. ఓ వైపు డైరెక్షన్, మరోవైపు యాక్టింగ్.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడమంటే అంత తేలికైన అంశం కాదు కానీ, నటనలో వందకు వంద మార్కులేయించుకున్నాడు విశ్వక్ సేన్. డైరెక్షన్‌లో మాత్రం పూర్తి మార్కులకు ఆస్కారం లేదు. హీరోయిన్, మురళీ శర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. పాటలకు ఈ సినిమాలో చోటివ్వలేదు. దాంతో హీరోయిన్ గ్లామర్‌కి కూడా స్కోప్ లేదు. అలాగే మినిస్టర్ కొడుకు పాత్ర పోషించిన తారక్ పొన్నాడ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఈ సినిమాకి. అతని బ్యాక్ గ్రౌండ్ నేపథ్యమే కీలకం అలాగే మాస్క్ మ్యాన్ పాత్ర పోషించిన నటుడు, అతని ప్లాష్ బ్యాక్ కూడా సినిమాపై ప్రభావం చూపిస్తుంది. మిగిలిన పాత్రధారులంతా ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు:
రక్తపాతం నిండిన ఓ రివేంజ్ డ్రామాని ఈ సినిమా కోసం తీసుకున్నాడు. తెర మొత్తం బకెట్ల కొద్దీ రక్తంతో నింపేశాడు. మనుషుల అవయవాల్లో ఏమేమి వుంటాయో వాటన్నింటినీ ముక్కలు ముక్కులుగా కోసి, కసి తీరా చంపేసినట్లుగా చూపించాడు. కస కస శరీర అవయవాలన్నీ వేరయ్యేలా.! అత్యంత కిరాతకత్వం చూపించాడు తెరపై. ఏం సాధించాలనుకున్నాడో ఏమో ఇలాంటి పైశాచికత్వం నుంచి. గతంలో పలు చిత్రాలతో మొదలై ఇప్పటికే ఈ తరహా పైశాచికత్వాలు నిన్న నాని ‘ప్యారడైజ్’ వరకూ చూస్తూనే వున్నాం. తిట్టుకుంటూనే వున్నాం. వాటన్నింటినీ మించిపోయాడు విశ్వక్ సేన్ ఈ సినిమాతో. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తెరపై కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌ని హైలైట్ చేసేలానే వుంది. పాటలకు స్కోప్ లేదు అక్కడికి బతికిపోయామనే అనిపిస్తుంది. భరించలేం ఇక. తొలి పార్ట్ అంతా సోది.. సాగతీత.. రెండో పార్ట్‌లో బీభత్సమైన ఊచకోత.. ఓవరాల్‌గా ఇదీ ‘కల్ట్’ మూవీ పరిస్థితి.

ప్లస్ పాయింట్స్:
విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్, అక్కడక్కడా కొన్ని ట్విస్టులు.. 

మైనస్ పాయింట్స్:
 చాలానే వుంటాయ్. ఆల్రెడీ కొన్ని గేమ్ ఓరియెంటెడ్ మూవీస్‌లో ఈ తరహా కాన్సెప్ట్ చూసేశాం. అయితే, ఈ సినిమాలో ఇంకాస్త పైశాచికత్వం ఎక్కువ ప్రదర్శించారంతే. 

చివరిగా:
ముందుగానే హెచ్చరించడం మంచిదైంది. ‘#కల్డ్’ సాగతీత - ఊచకోత.! ఫైనల్‌గా రక్తపాత.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com