అటల్ జీ జీవితం, భాషాభిమానం, జాతీయవాదం, సుపరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకం: వెంకయ్యనాయుడు

- October 30, 2026 , by Maagulf
అటల్ జీ జీవితం, భాషాభిమానం, జాతీయవాదం, సుపరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకం: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం, ఆదర్శాలు, దేశం పట్ల ఆయన అంకితభావం నేటి తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

‘భారతరత్న అటల్: హిందీ, జాతీయవాదం, సుపరిపాలన’ అనే అంశంపై న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రత్యేక ప్రసంగం చేశారు. అటల్ జీకి హిందీ భాషపై ఉన్న అభిమానం, 1977లో ఐక్యరాజ్యసమితి వేదికపై హిందీలో ప్రసంగించడం భారతీయ భాషా ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. ఆయన జాతీయవాదం మానవత్వం, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నదని వివరించారు. 

పోఖ్రాన్ అణు పరీక్షలు, లాహోర్ బస్సు యాత్ర ద్వారా భద్రతతో పాటు శాంతి, సంభాషణకు ఆయన ప్రాధాన్యమిచ్చారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు సుపరిపాలనకు నిదర్శనమన్నారు. హిందీని జ్ఞాన, విజ్ఞాన, సాంకేతిక రంగాల భాషగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. హిందీతో పాటు భారతీయ భాషలన్నింటినీ ఇదే మార్గంలో ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. మాతృభాష పట్ల ప్రేమ, సోదర భాషల పట్ల గౌరవం కలిగి ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ఇది ప్రతిరూపంగా భాసిల్లుతుందని పేర్కొన్నారు.

విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... హిందీని రుద్దుతున్నారు అనే మనస్తత్వాన్ని వదిలించుకోవలసిన అవసరం ఉందని సూచించారు. ఇది రుద్దడం కాదు, తిలకాన్ని దిద్దిడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తిలకంలో రంగుతో పాటు, సువాసన కూడా ఉంటుందని... భాషలో కూడా పదాలు మాత్రమే కాకుండా... శబ్ధ మాధుర్యం కూడా దాగి ఉంటుందని, దీన్ని ఆస్వాదించడం ద్వారా జాతీయ భావనలు మొలకెత్తుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా, విశ్వ హిందీ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.బిపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com