సైబరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’.. నగర రవాణా భవిష్యత్తు పై ప్రత్యేక ప్రదర్శన
- October 30, 2026
సైబరాబాద్: సమాచార సాంకేతిక రంగం (ఐటీ), ఐటీ ఆధారిత సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఫార్మాస్యూటికల్ రంగాలకు ప్రముఖ కేంద్రంగా సైబరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, నివాస ప్రాంతాలు, ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా మెరుగైన రవాణా సదుపాయాలు, సమర్థవంతమైన ప్రజా రవాణా అనుసంధానం, ఉద్యోగ కేంద్రాలకు సులభంగా చేరుకునే అవకాశాలను కల్పించడం అత్యంత కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ రూపకల్పనపై చర్చించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC), షిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.
నవంబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సైబరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజల కోసం మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కూడా ప్రారంభించారు.
నగర రవాణా వ్యవస్థ పై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమల ప్రతినిధులు, పట్టణాభివృద్ధి నిపుణులు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలు, మీడియా, విద్యార్థులు, పౌరులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సైబరాబాద్ రవాణా ప్రయాణాన్ని సమీక్షిస్తూ, భవిష్యత్తులో మరింత మెరుగైన రవాణా వ్యవస్థను ఎలా నిర్మించుకోవచ్చనే అంశంపై సమిష్టి చర్చలకు ఈ వేదిక అవకాశం కల్పించనుంది.
రవాణా వ్యవస్థలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేశ్, ఐపీఎస్
ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్, ఐపీఎస్ మాట్లాడుతూ,“నగరం విస్తరిస్తున్న కొద్దీ రవాణా వ్యవస్థ కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఉండాలి. ఇందుకోసం ప్రజల్లో అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తనను అలవర్చుకోవడం, ప్రభుత్వ శాఖలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరం.
‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమం వివిధ వర్గాల అభిప్రాయాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే వినూత్న ప్రయత్నం. సురక్షితమైన రహదారులు, అందరికీ అందుబాటులో ఉండే మెరుగైన రవాణా వ్యవస్థ నిర్మాణం కోసం ప్రజల్లో సమిష్టి బాధ్యతను పెంపొందించడమే మా లక్ష్యం. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, మెరుగైన సైబరాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం” అని తెలిపారు.
మెరుగైన రవాణా వ్యవస్థ కోసం సమిష్టి కృషి అవసరం: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన, మాట్లాడుతూ,
“సైబరాబాద్ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో నగరంలో ప్రజల రాకపోకల విధానాన్ని పునరాలోచించడానికి మంచి అవకాశం ఏర్పడింది. నగరాభివృద్ధికి అనుగుణంగా సురక్షితమైన, అందుబాటు ధరల్లో లభించే, అందరికీ అనుకూలమైన, పర్యావరణహిత రవాణా వ్యవస్థలు అభివృద్ధి చెందాలి.
వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ‘సైబరాబాద్ కన్వర్జెన్స్’ వేదికగా పనిచేస్తోంది. నగరంలోని ట్రాఫిక్ జంక్షన్లను మెరుగుపరచడం, రహదారులను అభివృద్ధి చేయడం, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించడం వంటి అనేక చర్యలు చేపడుతున్నాం.
ఈ వినూత్న వేదిక ద్వారా ప్రజలందరూ పరిష్కారాల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. ముఖ్యంగా విద్యార్థులు మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వినూత్న ఆలోచనలను పంచుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఎండీఏ, హుమ్టా (HUMTA), రవాణా శాఖ, ఓపెన్ డేటా తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులోకి నగర రవాణా సమాచారం
‘సైబరాబాద్ మూవ్స్ 2026’లో భాగంగా భారీ మ్యాపులు, డేటా విజువలైజేషన్లు, ఇంటరాక్టివ్ ప్రదర్శనల ద్వారా నగర రవాణా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అందించనున్నారు.
సందర్శకులు తమ నివాస ప్రాంతాలను గుర్తించడం, ప్రతిరోజూ ప్రయాణించే మార్గాలను పరిశీలించడం, తమ ప్రయాణ అనుభవాలు నగర రవాణా వ్యవస్థతో ఎలా అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారుల చర్చలు, నిపుణుల అవగాహన సదస్సులు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు, మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, పౌరులు రూపొందించిన వినూత్న ఆలోచనలను కూడా ప్రదర్శించనున్నారు.
వివిధ వర్గాల అనుభవాలు, అభిప్రాయాలు, రవాణా సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే రవాణా వ్యవస్థ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.
కార్యక్రమ వివరాలు:
• కార్యక్రమం: సైబరాబాద్ మూవ్స్ 2026
• తేదీలు: నవంబర్ 26, 27, 28, 2026
• వేదిక: టీ-హబ్, సైబరాబాద్
• మరిన్ని వివరాలకు: http://CyberabadMoves.in
తాజా వార్తలు
- హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులు వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యూఏఈ: జాతీయ సైనిక సేవ నుంచి తప్పించేందుకు సహకారం..పలువురు అధికారులపై విచారణ
- హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
- అటల్ జీ జీవితం, భాషాభిమానం, జాతీయవాదం, సుపరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకం: వెంకయ్యనాయుడు
- సైబరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’.. నగర రవాణా భవిష్యత్తు పై ప్రత్యేక ప్రదర్శన
- నవంబర్‌లో బ్యాంకులకు ఇన్ని సెలవులా?
- ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించింది ఫ్రాన్స్..!!
- గ్లోబల్ విలేజ్‌లో 700 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన..!!
- ఖతార్ నేషనల్ థియేటర్ రెనోవేషన్ పనులు ప్రారంభం..!!
- కువైట్‌లో డెలివరీ బైక్‌లపై ప్రత్యేక తనిఖీలు..!!







