ప్రాంతీయ భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి కీలక చర్చలు..!!

- October 31, 2026 , by Maagulf
ప్రాంతీయ భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి కీలక చర్చలు..!!

అట్లాంటా: ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, సముద్ర మార్గాల్లో నౌకాయానానికి ఎదురవుతున్న ముప్పులపై సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కీలక చర్చలు జరిపారు. అమెరికాలోని అట్లాంటాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా, కెనడా విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్‌తో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జరిగిన భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా యెమెన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతుండటం, హోర్ముజ్ జలసంధి, బాబ్ అల్ మందెబ్ జలసంధి మీదుగా జరిగే సముద్ర రవాణాకు కొనసాగుతున్న ముప్పులపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడం, శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు.

అనంతరం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో సమావేశమైన ప్రిన్స్ ఫైసల్.. ఇరు దేశాల సంబంధాలు, తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. సౌదీ అరేబియాపై హౌతీ మిలీషియా కొనసాగిస్తున్న దాడులను ఇరుపక్షాలు ఖండించాయి. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం సమిష్టి ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశాయి.

యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి, యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్‌తోనూ సౌదీ విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడంతో పాటు మధ్యప్రాచ్యంలో భద్రత, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com