సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్

- October 31, 2026 , by Maagulf
సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్

అంతర్జాతీయంగా ఎదురవుతున్న వివాదాలు, సమస్యలను సైనిక చర్యలతో పరిష్కరించలేమని, శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. అమెరికాలోని అట్లాంటా నగరం వేదికగా జరిగిన జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

నౌకాయాన స్వేచ్ఛ పరిరక్షణకు పిలుపు

సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని జైశంకర్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ చట్టాలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (UNCLOS) ప్రకారం సముద్ర ప్రయాణ స్వేచ్ఛను , నౌకాయాన భద్రతను కాపాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణల వల్ల 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, వారిలో 14 మంది నావికులు ఉన్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు విడనాడాలి

అభివృద్ధి చెందుతున్న దేశాల పారిశ్రామిక ప్రగతికి మార్కెట్ ఆంక్షలు, సరఫరా వ్యవస్థల నిరోధాలు తీవ్ర ప్రతిబంధకంగా మారుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు.

డిసెంబర్‌లో ‘మియామీ’ జీ20 శిఖరాగ్ర సదస్సు

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధ్యక్షతన ఈ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సన్నాహక సమావేశాల అనంతరం జీ20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) డిసెంబర్ 14, 15 తేదీల్లో మియామీ నగరంలో జరగనుందని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com