బహ్రెయిన్‌లో ప్రవాస డ్రైవర్లకు దేశ బహిష్కరణ ముంపు?
- October 31, 2026
బహ్రెయిన్: తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే విదేశీ డ్రైవర్లను శిక్షాకాలం పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించే ప్రతిపాదనపై బహ్రెయిన్ పార్లమెంట్ చర్చించనుంది. ఎంపీ ఇమాన్ షువైటర్ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. తదుపరి పార్లమెంట్ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే, పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ప్రవాస డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు ట్రాఫిక్ లేదా రెసిడెన్సీ చట్టాల్లో స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు.
కొంతమంది విదేశీ డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణనష్టం, తీవ్ర గాయాలు సంభవిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు పాల్పడిన ప్రవాసులను బహిష్కరించడం ద్వారా ప్రజల భద్రతను కాపాడవచ్చని, ఇతరులకు కూడా హెచ్చరికగా ఉంటుందని అన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే విదేశీ నేరస్థులను దేశం నుంచి బహిష్కరించే అధికారం న్యాయస్థానాలకు, సంబంధిత అధికారులకు ఉందని స్పష్టం చేసింది.
పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 64 బిస్ ప్రకారం, నేరానికి పాల్పడిన విదేశీయుడికి అదనపు శిక్షగా శాశ్వతంగా లేదా కనీసం మూడేళ్లపాటు దేశ బహిష్కరణ విధించవచ్చు. 2014 ట్రాఫిక్ చట్టంతో సహా ఇతర చట్టాల పరిధిలోని నేరాలకూ ఈ నిబంధన వర్తిస్తుందని ఆర్టికల్ 111 పేర్కొంటోంది. అంతేకాకుండా, విదేశీయుల ప్రవర్తన ప్రజా ప్రయోజనాలకు, శాంతిభద్రతలకు హానికరంగా ఉందని భావిస్తే, అలియన్స్ (ఇమ్మిగ్రేషన్ అండ్ రెసిడెన్స్) చట్టంలోని ఆర్టికల్ 25 ప్రకారం కోర్టు ఆదేశం లేకుండానే ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశం నుంచి బహిష్కరించవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది.
ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఎక్కువగా నిర్లక్ష్యం కారణమవుతుందని, ఉద్దేశపూర్వకంగా చేసే ఇతర నేరాలతో వీటిని సమానంగా చూడలేమని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రతి తీవ్రమైన ట్రాఫిక్ నేరానికి దేశ బహిష్కరణ తప్పనిసరి చేయడం న్యాయమూర్తుల విచక్షణాధికారాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అయితే, ప్రమాదకరంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై మరింత స్పష్టమైన నిబంధనలు ఉండాలని ఎంపీ ఇమాన్ షువైటర్ పట్టుబడుతున్నారు. జరిమానాలు, జైలు శిక్షలతో పాటు దేశ బహిష్కరణ భయం కూడా ఉంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా డ్రైవర్లు జాగ్రత్తపడతారని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాస డ్రైవర్లకు దేశ బహిష్కరణ ముంపు?
- మనామా డైలాగ్ 2026..సముద్ర భద్రతపై చర్చలు..!!
- ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!
- ప్రాంతీయ భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి కీలక చర్చలు..!!
- కువైట్‌లో ఉద్యోగులకు ఊరట..!!
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుడ్ డెలివరీ రైడర్ మృతి..!!
- యూఏఈలో వాహనదారులకు ఊరట.. నవంబర్‌లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఇరాన్‌పై ట్రంప్ మరో దాడికి సిద్ధమా?
- వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నియామకం..షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు
- సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్







