ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!

- October 31, 2026 , by Maagulf
ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!

ఒమన్‌లో క్యాన్సర్‌పై అవగాహనకు భారీ వాక్‌థాన్..!!

మస్కట్: క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు వ్యాధిగ్రస్తులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపే లక్ష్యంతో ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ (OCA) నిర్వహించిన 22వ వార్షిక వాక్‌థాన్ విజయవంతంగా ముగిసింది. మస్కట్‌లోని అల్ ఖురమ్ నేచురల్ పార్క్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ‘వాక్ విత్ హోప్’ (ఆశతో నడుద్దాం) అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పర్యాటక శాఖ అండర్ సెక్రటరీ అజ్జాన్ బిన్ ఖాసిం అల్ బుసైదీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, ప్రైవేటు సంస్థల సభ్యులు, కుటుంబాలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈసారి రెండు రోజుల పాటు వాక్‌థాన్‌ను నిర్వహించారు. మొదటి రోజు అక్టోబర్ 29న క్యాన్సర్‌ను జయించిన వారితో పాటు ప్రజల మధ్య ఐక్యత, పరస్పర అనుబంధాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. రెండో రోజు అక్టోబర్ 30న వార్షిక వాక్‌థాన్ నిర్వహించి క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేక విభాగం, నాటక, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహార స్టాళ్లు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో పార్క్‌లో కుటుంబ సమేతంగా పాల్గొనేలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించడం ఈ వాక్‌థాన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వ్యాధిగ్రస్తులకు, వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాల్సిన అవసరాన్ని కూడా ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా క్యాన్సర్ నివారణ, అవగాహన, ముందస్తు పరీక్షలు, ఉపశమన వైద్య సేవలతో పాటు బాధితులకు, వారి కుటుంబాలకు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించి, క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com