యూఏఈలో వింటర్ హాలిడేస్.. చివరి నిమిషంలో ట్రిప్‌లకు పెరుగుతున్న డిమాండ్..!!
- November 04, 2026
దుబాయ్: యూఏఈలో నేషనల్ డే, వింటర్ సెలవుల నేపథ్యంలో స్వల్పకాలిక విహారయాత్రలకు (మైక్రో బ్రేక్స్) డిమాండ్ పెరుగుతోంది. కుటుంబాలు ఎక్కువ రోజులు విదేశీ పర్యటనలకు వెళ్లకుండా, తక్కువ సమయంలోనే సరదాగా గడిపి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ప్రయాణానికి వారం రోజుల ముందు కూడా టూర్లను బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ట్రావెల్ సంస్థలు వెల్లడించాయి.
గతంలో దేశీయ స్టేకేషన్లు, గల్ఫ్ దేశాల పర్యటనలను మూడు నుంచి నాలుగు వారాల ముందుగానే బుక్ చేసుకునేవారు. ప్రస్తుతం ప్రయాణానికి కేవలం 7 నుంచి 10 రోజుల ముందు బుకింగ్‌లు ఖరారు చేస్తున్నారని ట్రావెల్ రంగ ప్రతినిధులు తెలిపారు. రస్ అల్ ఖైమా, ఫుజైరాలో రెండు రాత్రుల బీచ్ హాలిడేస్ నుంచి జార్జియా, అజర్‌బైజాన్ వంటి దేశాల్లో ఐదు రోజుల పర్యటనల వరకు వివిధ రకాల ట్రిప్‌లను ఎంచుకుంటున్నారు.
ట్రిప్‌వెంచురా సీఈఓ ఆదిల్ తన్రివెర్డి మాట్లాడుతూ.. స్వల్పకాలిక విహారయాత్రలు, చివరి నిమిషంలో బుకింగ్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థలో దేశీయ స్టేకేషన్, జీసీసీ ప్యాకేజీల్లో సుమారు 45 శాతం బుకింగ్‌లు ప్రయాణానికి 7 నుంచి 10 రోజుల ముందే పూర్తవుతున్నాయని చెప్పారు. గతంలో ఈ వ్యవధి మూడు నుంచి నాలుగు వారాలుగా ఉండేదని వివరించారు.
దేశీయ పర్యటనలకు రెండు నుంచి మూడు రాత్రులు, ప్రాంతీయ విదేశీ పర్యటనలకు నాలుగు నుంచి ఐదు రోజుల సమయాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారని తెలిపారు. రస్ అల్ ఖైమా, ఫుజైరా, అబుధాబిలోని బీచ్, ఎడారి రిసార్టులతో పాటు ఒమన్‌లోని ముసందమ్, సలాలా, అజర్‌బైజాన్‌లోని బాకు, జార్జియాలోని టిబిలిసి పర్యాటకుల ఎంపికల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే తమ సంస్థలో దేశీయ స్టేకేషన్ బుకింగ్‌లు 30 నుంచి 35 శాతం పెరిగాయని వెల్లడించారు. కుటుంబాలు విదేశీ పర్యటనలను పూర్తిగా వాయిదా వేయడం లేదని, దుబాయ్, రస్ అల్ ఖైమా, అబుధాబి, ఫుజైరాల్లో వారాంతపు విహారయాత్రలతో పాటు ముందుగా ప్రణాళిక చేసుకున్న విదేశీ పర్యటనలను కూడా కొనసాగిస్తున్నాయని వివరించారు.
దుబాయ్‌లోని అరోరా ట్రావెల్ అండ్ టూరిజం డైరెక్టర్, జనరల్ మేనేజర్ రీనా ఎం. ఫిలిప్ మాట్లాడుతూ.. యూఏఈలోనే హాలిడే గడిపేందుకు స్థానికుల నుంచి విచారణలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా దుబాయ్, షార్జా నివాసితులు దేశంలోని మంచి హోటళ్లలో బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ ఏడాది హోటళ్ల ఆక్యుపెన్సీ స్థాయులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గత ఏడాదితో పోలిస్తే కొన్ని హోటళ్ల ధరలు కొంత తగ్గాయని పేర్కొన్నారు. దీంతో స్థానికంగా విహారయాత్రలు చేసేందుకు కుటుంబాలు మొగ్గుచూపుతున్నాయని వివరించారు.
విదేశాలకు వెళ్లాలనుకునే వారు కూడా తక్కువ రోజుల్లో పూర్తయ్యే పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సులభంగా వీసాలు పొందగలిగే, విమాన సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. జార్జియా, కజకిస్థాన్‌లోని అల్మాటీ, వియత్నాం వంటి ప్రాంతాలకు ఐదు రోజుల పర్యటనలపై ఆసక్తి పెరుగుతోందని రీనా ఫిలిప్ తెలిపారు. ఇప్పటికే షెంజెన్ వీసాలు ఉన్నవారు యూరప్ పర్యటనలకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ప్రాంతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు విదేశీ ప్రయాణాల విషయంలో కొంతమంది యూఏఈ నివాసితుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రాంతీయ అనిశ్చితి కారణంగా పర్యాటకులు తమ ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకోవడం లేదని, బదులుగా గమ్యస్థానాలు, విమాన మార్గాలను మార్చుకుంటున్నారని ఆదిల్ తన్రివెర్డి తెలిపారు. తమ సంస్థలో మొత్తం ట్రిప్ రద్దులు 5 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని చెప్పారు. కొన్ని ట్రాన్సిట్ ఆధారిత విమాన మార్గాలు, తూర్పు మధ్యధరా ప్రాంతాలకు సంబంధించి విదేశీ పర్యటనల విచారణలు తాత్కాలికంగా 15 నుంచి 20 శాతం తగ్గాయని వెల్లడించారు. అదే సమయంలో ఒమన్, అజర్‌బైజాన్, జార్జియా, టర్కియే, మధ్య ఐరోపా నగరాల వంటి ప్రత్యామ్నాయ ప్రాంతాలకు విదేశీ పర్యటనల డిమాండ్ 25 శాతం పెరిగిందని తెలిపారు.
ప్రయాణాలపై ఆసక్తి తగ్గలేదని, అందుబాటులో ఉన్న సౌకర్యవంతమైన విమాన మార్గాలు, సులభమైన ప్రవేశ నిబంధనలు, తక్కువ ఖర్చుతో కూడిన పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడంలో ప్రయాణికులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వివరించారు. బీఎన్‌బీఎంఈ హాలిడే హోమ్స్ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా మహతాని కూడా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం హాలిడే వసతి ధరలు కొంత తక్కువగా ఉన్నాయని, దీంతో ప్రయాణికులు ముందుగానే బుకింగ్‌లు చేసుకుని మెరుగైన ఆఫర్లను పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!
- యూఏఈలో వింటర్ హాలిడేస్.. చివరి నిమిషంలో ట్రిప్‌లకు పెరుగుతున్న డిమాండ్..!!
- వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలు..
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!







