ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్‌వాటర్ మ్యూజియం..!!

- November 10, 2026 , by Maagulf
ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్‌వాటర్ మ్యూజియం..!!

మస్కట్: ఒమన్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక కట్టడాలు ఇకపై సముద్ర గర్భంలోనూ కనువిందు చేయనున్నాయి. రాయల్ ఒపెరా హౌస్ మస్కట్, అల్ ఆలం ప్యాలెస్, అల్ సహ్వా టవర్ వంటి ప్రసిద్ధ నిర్మాణాల నమూనాలతో సముద్రం అడుగున ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. డేమానియాత్ ఐలాండ్స్ నేచర్ రిజర్వ్‌లో ‘అండర్‌వాటర్ ల్యాండ్‌మార్క్స్ ఆఫ్ ఒమన్ మ్యూజియం’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.

ఒమన్ ఎన్విరాన్‌మెంట్ అథారిటీ, ఒమాంటెల్, ఇన్నోటెక్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో పాటు పర్యావరణానికి అనుకూలమైన కాంక్రీట్‌ను ఉపయోగించి ఈ నిర్మాణాలను రూపొందిస్తున్నారు. వీటి ద్వారా పగడపు దిబ్బల పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు సముద్ర జీవులకు సహజ ఆవాసాలను కల్పించనున్నారు.

ప్రాజెక్టు తొలి దశలో నేచర్ రిజర్వ్ పరిధిలో 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు ప్రధాన నిర్మాణాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్, అల్ ఆలం ప్యాలెస్, అల్ సహ్వా టవర్ వంటి ప్రముఖ కట్టడాల నమూనాలు ఉంటాయి. కాలక్రమేణా ఇవి సముద్ర జీవులకు అనువైన ఆవాసాలుగా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.

అంతేకాకుండా సముద్ర పర్యావరణంపై శాస్త్రీయ పరిశోధనలు, పర్యావరణ విద్యకు కూడా ఇది వేదికగా నిలవనుంది. ఒమన్‌తో పాటు విదేశాల నుంచి వచ్చే స్కూబా డైవింగ్ ఔత్సాహికులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. తొలి దశ పనులను రాబోయే నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించి రెండో దశను చేపట్టనున్నారు. ఇందులో ఒమన్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మరిన్ని ప్రముఖ కట్టడాల నమూనాలను సముద్ర గర్భంలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com