డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- November 10, 2026
ఫోన్ కారణంగా నాలుగు వాహనాలు ఢీ.. ఇద్దరికి స్వల్ప గాయాలు
దుబాయ్: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని, ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో రహదారిపై దృష్టి కేంద్రీకరించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
దుబాయ్ పోలీస్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల డ్రైవర్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే సామర్థ్యం తగ్గుతుందని తెలిపారు. ఫలితంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దుబాయ్–అల్ ఐన్ రోడ్డు పై నాలుగు వాహనాలు ఢీ
ఇటీవల దుబాయ్–అల్ ఐన్ రోడ్డు పై నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం, వాహనాల్లో ఒకదానిని నడుపుతున్న డ్రైవర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ దృష్టి మరల్చుకోవడంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి కారణమైనట్లు వెల్లడైంది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ఘటనా స్థలంలోనే వారికి వైద్య చికిత్స అందించారు.
డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి పెట్టాలి
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు దుబాయ్ పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బ్రిగేడియర్ జుమా బిన్ సువైదాన్ తెలిపారు.
డ్రైవింగ్ సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడటం, సందేశాలు చదవడం, అప్లికేషన్లు చూడటం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఆహారం తినడం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వంటి దృష్టి మరల్చే పనులను కూడా నివారించాలని కోరారు.
వాహనదారులు రహదారిపై ఇతర వాహనాలు, పాదచారుల కదలికలను గమనించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లు, రహదారి సూచికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందున్న వాహనం అకస్మాత్తుగా ఆగినప్పుడు ప్రమాదం జరగకుండా తగినంత దూరం పాటించాలని తెలిపారు.
ఇతర వాహనదారుల వల్ల జరిగే పొరపాట్లను ముందుగానే అంచనా వేసుకుంటూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రశాంతంగా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్ చేయాల్సి వచ్చినా, సందేశం చదవాల్సి వచ్చినా ముందుగా వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో నిలిపిన తర్వాతే ఆ పని చేయాలని స్పష్టం చేశారు.
కొన్ని క్షణాల నిర్లక్ష్యం.. ప్రాణాలకే ప్రమాదం!
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్‌పై కొన్ని క్షణాల పాటు దృష్టి పెట్టడం కూడా తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ







