ఒమన్‌లో ముగిసిన ‘మస్కట్ ఆర్ట్ 2026’.. కళాకారుల సందడి..!!

- November 11, 2026 , by Maagulf
ఒమన్‌లో ముగిసిన ‘మస్కట్ ఆర్ట్ 2026’.. కళాకారుల సందడి..!!

మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లో నిర్వహించిన ఐదో అంతర్జాతీయ కళా ప్రదర్శన ‘మస్కట్ ఆర్ట్ 2026’ ముగిసింది. అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఒమన్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు.

మస్కట్ గవర్నర్, మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28న ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కళ, వ్యక్తిగత గుర్తింపు, ప్రజల జీవనశైలికి మధ్య ఉన్న సంబంధాలను వివిధ కళారూపాల ద్వారా ఆవిష్కరించారు. ఒమన్‌ను ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, అంతర్జాతీయ కళాకారుల మధ్య పరస్పర పరిచయాలు, సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం విజయవంతమైంది.

ప్రదర్శనతో పాటు వివిధ వర్క్‌షాప్‌లు, చర్చా కార్యక్రమాలు, ఆర్ట్ టాక్స్ నిర్వహించారు. సృజనాత్మక రంగాల్లో వస్తున్న మార్పులు, సాంస్కృతిక అభివృద్ధిలో కళల పాత్రపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒమన్ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, సాంస్కృతిక సంస్థలతో అనుసంధానం కల్పించడం కూడా ఈ ప్రదర్శన లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

ఈ ఏడాది ప్రదర్శనలో ఇటలీకి చెందిన బహుముఖ కళాకారులు, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రచారకర్తలు లూకా మోరెట్టి, లూసియా ఒలివా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘రూట్స్ ఆఫ్ ఆర్ట్’ పేరుతో రూపొందించిన వినూత్న ప్రాజెక్టులో భాగంగా ఫ్యాషన్, దృశ్యకళలు, ప్రదర్శన కళలను కలిపి తమను తామే కళాఖండాలుగా ఆవిష్కరించారు. 

అదే సమయంలో మిలిటరీ కాలేజీ విద్యార్థులతో పాటు వినికిడి లోపం ఉన్నవారి ఒమన్ సంఘం సభ్యులు కూడా తమ కళాఖండాలను ప్రదర్శించారు. మాటలతో సంబంధం లేకుండా కళ ద్వారా భావాలను వ్యక్తపరచవచ్చని ఈ ప్రదర్శన చాటిచెప్పింది. మొత్తానికి వివిధ దేశాల కళాకారులు, విభిన్న కళారూపాలు, సాంస్కృతిక పరస్పర పరిచయాలతో ‘మస్కట్ ఆర్ట్ 2026’ కళకు దేశాలు, సంప్రదాయాలు, ప్రజల మధ్య అనుసంధాన వారధిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com