సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ

- November 11, 2026 , by Maagulf
సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
రియాద్: సముద్ర రవాణా భద్రతకు ముప్పు కలిగించే అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని సౌదీ అరేబియా మంత్రివర్గం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, బాబ్ అల్ మందెబ్ జలసంధి, హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల భద్రతను దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది.
 
 రియాద్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సమీక్ష సందర్భంగా సౌదీ అరేబియా ప్రాంతీయ, ప్రపంచ భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తుందని కేబినెట్ పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు నేర కార్యకలాపాలకు పాల్పడే మిలీషియా సంస్థలను నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
 
గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సభ్య దేశాలను అనుసంధానించే జీసీసీ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి సాధారణ ఒప్పందంపై సంతకాలు జరగడాన్ని కేబినెట్ స్వాగతించింది. హజ్ సేవల మెరుగుదలకు సౌదీ అరేబియా చేస్తున్న కృషిని కూడా కేబినెట్ ప్రశంసించింది. డైరెక్ట్ హజ్ కార్యక్రమాన్ని 133 దేశాలకు విస్తరించడం, యాత్రికులు తమ దేశాల నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి చేరుకునే వరకు ప్రయాణాన్ని సులభతరం చేసేలా కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు ప్రకటించడాన్ని ప్రశంసించింది.
 
సౌదీ విజన్ 2030 అమలులో భాగంగా వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని కూడా కేబినెట్ సమీక్షించింది. ఈ సమావేశంలో వినియోగదారుల రక్షణ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పెట్రోలియం, గ్యాస్ రంగాల్లో సహకారం కోసం సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ, దక్షిణ కొరియా వాణిజ్య, పరిశ్రమలు, వనరుల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. 
 
దౌత్య, ప్రత్యేక పాస్‌పోర్టులు కలిగిన వారికి ప్రవేశ వీసాల పరస్పర మినహాయింపుపై పోర్చుగల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. డిజిటల్ కమ్యూనికేషన్లు, మౌలిక సదుపాయాల రంగంలో సహకారం కోసం జోర్డాన్, సిరియాలతో ఒప్పంద ముసాయిదాపై చర్చించి సంతకాలు చేసేందుకు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి అనుమతి ఇచ్చింది. 
 
సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ మధ్య పెట్టుబడుల పరస్పర ప్రోత్సాహం, రక్షణ ఒప్పందంపై సంతకాలకు కూడా ఆమోదం తెలిపింది. సైప్రస్‌తో సముద్ర వ్యవహారాల్లో సహకారం కోసం అవగాహన ఒప్పందంపై చర్చలు జరిపేందుకు రవాణా, లాజిస్టిక్స్ సేవల మంత్రికి అనుమతి ఇచ్చింది. టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖతో రైల్వే రంగంలో సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపింది. 
 
విదేశాల్లో ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పై చదువుకుంటున్న విద్యార్థులు, అధికారిక విధుల నిమిత్తం విదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారితో పాటు విదేశాల్లో నివసించే వయోజన కుటుంబ సభ్యులు దిగుమతి చేసుకునే వాహనాలపై కస్టమ్స్ సుంకాలు, విలువ ఆధారిత పన్ను (VAT)ను ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా వాహనాల దిగుమతిపై విధించే ఆర్థిక రుసుము నుంచి కూడా వారికి మినహాయింపు కల్పించింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com