పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- November 11, 2026
మనామా: పిల్లలు సోషల్ మీడియాను వినియోగించే విషయంలో వయసు ఆధారిత నిబంధనలు, తల్లిదండ్రుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే ప్రతిపాదిత చట్టానికి బహ్రెయిన్ పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపారు. పిల్లలు ప్రస్తుతం అమల్లో ఉన్న సోషల్ మీడియా వయోపరిమితులను సులభంగా అధిగమిస్తున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
బహ్రెయిన్ చైల్డ్ లాలో సవరణలు చేయడం ద్వారా పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను ఎలా తెరవాలి, మెసేజింగ్ యాప్‌లు, ఇతర ఆన్‌లైన్ సేవలను ఎలా వినియోగించాలనే అంశాలపై నిబంధనలు రూపొందించే అధికారం సంబంధిత అధికారులకు కల్పించనున్నారు. అయితే ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఉంటుంది.
ఈ ప్రతిపాదనలో పిల్లలకు సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి కనీస వయసును నిర్దేశించలేదు. అలాగే ఎలాంటి పూర్తి నిషేధాన్ని ప్రతిపాదించలేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు లేదా ఇతర శిక్షలను కూడా సూచించలేదు.
ఎంపీ బదర్ అల్ తమీమి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం షేర్ చేస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు పర్యవేక్షించడం కష్టంగా మారిందన్నారు. గతంలో కమ్యూనికేషన్‌కు రెండు, మూడు మార్గాలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం లెక్కించలేనన్ని ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
చాలా సోషల్ మీడియా సంస్థలు ఖాతాలు తెరవడానికి కనీస వయసును నిర్దేశిస్తున్నప్పటికీ, పిల్లలు సులభంగా ఆ నిబంధనలను అధిగమిస్తున్నారని ఆయన వివరించారు. కొత్త చట్టం ద్వారా పిల్లల ఆన్‌లైన్ వినియోగంపై అధికార యంత్రాంగం మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణను కొనసాగించవచ్చని తెలిపారు.
ఈ నిబంధనలు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లకే పరిమితం కాకుండా వాట్సాప్, స్నాప్‌చాట్, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా వర్తించే అవకాశం ఉందని పార్లమెంట్‌కు అందించిన న్యాయపరమైన సలహాలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను బదర్ అల్ తమీమితో పాటు మహమ్మద్ అల్ ఒలైవీ, అహ్మద్ ఖరాటా, మహమ్మద్ అల్ రిఫాయ్ సహా ఐదుగురు ఎంపీలు ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







