పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- November 11, 2026
యూఏఈ: లులు గ్రూప్ ఛైర్మన్ ఎం.ఎ. యూసుఫ్ అలీ, సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తులపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోబోమని లులు గ్రూప్ స్పష్టం చేసింది. నిందితులు బహిరంగంగా క్షమాపణలు చెప్పినా తమ న్యాయపోరాటం కొనసాగుతుందని వెల్లడించింది. లులు గ్రూప్ గ్లోబల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వి. నందకుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకుంటామని తెలిపారు.
మూడు ప్రాంతాల్లో న్యాయపోరాటం
కేరళ, లక్నో, ఢిల్లీలోని కోర్టుల్లో తప్పుడు వార్తలు, దుష్ప్రచారం చేసిన వారిపై లులు గ్రూప్ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ కేసులను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని నందకుమార్ స్పష్టం చేశారు. యూసుఫ్ అలీ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ రూ.100 మిలియన్ల (సుమారు Dh4 మిలియన్లు) నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా దాఖలైంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఓ ఆన్లైన్ మలయాళ వార్తా పోర్టల్ ఎడిటర్‌ను యూసుఫ్ అలీకి వ్యతిరేకంగా ప్రచురించిన పరువు నష్టం కలిగించే కథనాలను తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఏ వేదికపైనా ఆయనపై వ్యాఖ్యలు చేయకుండా ఆంక్షలు విధించింది. మరో కేసు కేరళలోని ఎర్నాకుళం సబ్ కోర్టులో దాఖలైంది.
ఈ ఆరోపణలు 2020 నవంబర్‌లో ప్రచురించిన ఓ వీడియోకు సంబంధించినవి. బంగారం స్మగ్లింగ్ కేసుతో యూసుఫ్ అలీ పేరును ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు తప్పని అంగీకరిస్తూ, ఆరోపణలు చేసిన వ్యక్తి అక్టోబర్ చివర్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ క్షమాపణలు వ్యక్తిగత విషయమని, వాటితో తమకు సంబంధం లేదని నందకుమార్ పేర్కొన్నారు. కోర్టు వెలుపల రాజీ చేసుకునే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు.
నిర్మాణాత్మక విమర్శలను, భిన్నాభిప్రాయాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను, ప్రశ్నించే హక్కును గౌరవిస్తామని, అయితే విమర్శలకు, ఉద్దేశపూర్వక అసత్య ప్రచారానికి మధ్య స్పష్టమైన తేడా ఉందని లులు గ్రూప్ పేర్కొంది. సంస్థతో పాటు ఛైర్మన్ ప్రతిష్ఠను కించపరిచే ప్రయత్నాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని నందకుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







