ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!

- November 11, 2026 , by Maagulf
ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!

దోహా: చిన్నారుల ప్రాథమిక విద్య, సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఖతార్ విద్య, ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ కీలక ప్రాజెక్టును ప్రారంభించింది. పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వయస్సు వరకు ఉన్న పిల్లల కోసం సమగ్ర విద్యా, అభివృద్ధి పాఠ్యప్రణాళికను రూపొందించనుంది. దేశవ్యాప్తంగా నర్సరీల్లో పిల్లలకు అందించే విద్య, సంరక్షణ నాణ్యతను పెంచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

‘డెవలపింగ్ ఎ కరిక్యులమ్ ఫర్ ది ప్రీ-కిండర్‌గార్టెన్ స్టేజ్ అండ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ కోర్సెస్ ఫర్ టీచర్స్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి విద్యా వ్యవహారాల సహాయ అండర్ సెక్రటరీ ఇబ్రహీం అబ్దుల్లా అల్ ముహన్నది, విద్యాశాఖ అధికారులు, విద్యా పర్యవేక్షకులు, నర్సరీల డైరెక్టర్లు, చిన్నారుల సంరక్షణ కేంద్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ ప్రాజెక్టు ద్వారా పిల్లల వయస్సు, ఎదుగుదల లక్షణాలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా జాతీయ స్థాయి పాఠ్యప్రణాళికను రూపొందిస్తారు. ఇందులో ఆరోగ్యం, మానసిక స్థితి, ప్రవర్తన, విలువలు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన విద్యా పద్ధతులను మెరుగుపరచడంతోపాటు నర్సరీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

ప్రైవేట్ ఎడ్యుకేషన్ అఫైర్స్ విభాగంలోని నర్సరీల శాఖ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. రూపొందించిన పాఠ్యప్రణాళికను దేశవ్యాప్తంగా నర్సరీలకు అందుబాటులో ఉంచి, దాని అమలును పర్యవేక్షించనున్నారు. తద్వారా అన్ని నర్సరీల్లో ఒకే విధమైన విద్యా, అభివృద్ధి ప్రమాణాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎర్లీ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్, సన్‌రైజ్ కార్యక్రమ జాతీయ నాయకురాలు ధబ్యా మహమ్మద్ అల్ ఖులైఫీ తెలిపారు. 

ఖతార్‌లో చిన్నారుల ప్రాథమిక విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక అడుగు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూనే ఇస్లామిక్ విలువలు, ఖతార్ జాతీయ గుర్తింపును ప్రతిబింబించేలా పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ నాణ్యమైన విద్య, సంరక్షణ అందించడం ద్వారా దేశ మానవ వనరుల అభివృద్ధికి పునాది వేస్తున్నామని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com