దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- November 20, 2026
దోహా: ప్రపంచ సినిమా రంగంలోని ప్రతిభను, కొత్త తరం చిత్ర దర్శకులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న దోహా ఫిల్మ్ ఫెస్టివల్ (DFF) 2026 ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 27 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ కళాకారులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొంటున్నారు.
ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో భారతీయ ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్‌తో పాటు సిరియా నటుడు తైమ్ హసన్‌కు DFF 2026 క్రియేటివ్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు. కథా రంగానికి, కళాత్మక సృజనకు వారు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను అందించారు. ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ షేక్ థానీ బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ అవార్డులను ప్రదానం చేశారు.
ప్రారంభోత్సవంలో యెమెన్, జోర్డాన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, ఖతార్ దేశాల సంయుక్త నిర్మాణంలో రూపొందిన 'ది స్టేషన్' చిత్రాన్ని ప్రదర్శించారు. యెమెన్-స్కాటిష్ దర్శకురాలు సారా ఇషాక్ తెరకెక్కించిన ఈ తొలి చిత్రం మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతంలో ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది.
ప్రముఖ జపాన్ దర్శకురాలు నవోమి కవాసే నేతృత్వంలోని అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పోటీ జ్యూరీలో ఆడమ్ బెస్సా, డోరా బౌచౌచా, జియాన్‌ఫ్రాంకో రోసీ, కమల్ అల్‌జాఫరి ఉన్నారు. దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్-హ్యుక్, ఎలియా సులేమాన్ తదితర అంతర్జాతీయ సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
దోహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ, ఫెస్టివల్ డైరెక్టర్ ఫాత్మా హసన్ అల్ రిమైహీ మాట్లాడుతూ.. ప్రాంతీయ, అంతర్జాతీయ చిత్ర నిర్మాతలకు వేదిక కల్పించడం, ప్రపంచానికి వినిపించాల్సిన కథలను ప్రోత్సహించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ కథకులు, చిత్ర నిర్మాతలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
మొత్తం 300,000 డాలర్లకు పైగా బహుమతులతో ఈ ఫెస్టివల్‌లో నాలుగు ప్రధాన పోటీ విభాగాలను నిర్వహిస్తున్నారు. అవి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్, మేడ్ ఇన్ ఖతార్ కాంపిటీషన్, అజ్యాల్ ఫిల్మ్ కాంపిటీషన్. ఈ తొమ్మిది రోజుల వేడుకలో ప్రపంచ, MENA ప్రాంతీయ ప్రీమియర్‌లతో పాటు సినీ చర్చా కార్యక్రమాలు, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, పరిశ్రమకు సంబంధించిన సమావేశాలు, కమ్యూనిటీ స్క్రీనింగ్‌లు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- మలేషియా వెళ్లే భారతీయులకు అలర్ట్.. 2027 నుంచి కొత్త రూల్స్
- ఖతార్‌లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!







