సౌదీ అరేబియాలో పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- November 23, 2026
రియాద్: సౌదీ అరేబియాలో నిర్మాణ రంగ వ్యయాలు పెరుగుతున్నాయి. 2025 అక్టోబర్‌తో పోలిస్తే 2026 అక్టోబర్‌లో నిర్మాణ వ్యయ సూచీ (Construction Cost Index – CCI) 2.3 శాతం పెరిగినట్లు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. నివాస, నివాసేతర నిర్మాణ రంగాల్లో ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. నివాసేతర నిర్మాణ రంగంలో వ్యయాలు 2.7 శాతం పెరగగా, నివాస నిర్మాణ రంగంలో 2.2 శాతం వృద్ధి నమోదైంది. నివాసేతర రంగంలో పరికరాలు, యంత్రాల అద్దె ఖర్చులు అత్యధికంగా 5.8 శాతం పెరిగాయి. ఆపరేటర్‌తో కూడిన యంత్రాల అద్దె వ్యయం 7.2 శాతం పెరిగింది. కార్మికుల ఖర్చులు 2.1 శాతం, ప్రాథమిక నిర్మాణ సామగ్రి ధరలు 2.0 శాతం, ఇంధన వ్యయాలు 3.0 శాతం పెరిగాయి. ఇతర నిర్మాణ సామగ్రి ధరల్లో 4.4 శాతం పెరుగుదల నమోదైంది.
ఇక నివాస నిర్మాణ రంగంలో పరికరాలు, యంత్రాల అద్దె ఖర్చులు 4.0 శాతం పెరిగాయి. ఆపరేటర్‌తో కూడిన యంత్రాల అద్దె వ్యయం 5.4 శాతం అధికమైంది. కలప, జాయినరీ ఉత్పత్తుల ధరలు 3.4 శాతం పెరగడంతో ప్రాథమిక నిర్మాణ సామగ్రి ఖర్చులు 1.8 శాతం పెరిగాయి. కార్మికుల ఖర్చులు 1.6 శాతం, ఇంధన వ్యయాలు 3.0 శాతం పెరిగాయి. నెలవారీగా చూస్తే 2026 సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో మొత్తం నిర్మాణ వ్యయ సూచీ 0.1 శాతం పెరిగింది. ఇందులో నివాసేతర నిర్మాణ వ్యయాలు 0.1 శాతం పెరగగా, నివాస నిర్మాణ వ్యయాల్లో ఎలాంటి మార్పు లేదు.
నిర్మాణ రంగానికి సంబంధించిన 51 రకాల ఇన్‌పుట్‌ల ధరల్లో మార్పులను నిర్మాణ వ్యయ సూచీ ద్వారా అంచనా వేస్తున్నట్లు GASTAT తెలిపింది. దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ కార్యాలయాలు, నిర్మాణ సామగ్రి సరఫరాదారుల నుంచి ప్రతి నెలా ఈ వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!
- ఖతార్‌లో ఈ టాబ్లెట్ రీకాల్..!!
- నేపాల్ కు రూ.15 వేల కోట్ల సాయం–ప్రధాని మోదీ
- సౌదీ అరేబియాలో పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!







