ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!

- November 26, 2026 , by Maagulf
ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!

మస్కట్: ఒమన్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్‌పీరియన్స్ ఒమన్ డ్రోన్ కాంపిటీషన్ 2026’ను ప్రారంభించింది. ఈ పోటీలో విజేతలకు మొత్తం RO 10,000 నగదు బహుమతులు అందించనున్నారు. ఇబ్న్ ఫిర్నాస్ డ్రోన్ సెంటర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. 

ఒమన్‌లోని సహజ అందాలు, చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక విశేషాలను డ్రోన్ ఫొటోగ్రఫీ, వీడియోల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఒమన్‌తో పాటు ఇతర దేశాల ఫొటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో నాలుగు విభాగాలు ఉన్నాయి. డ్రోన్ ఫొటోగ్రఫీ విభాగంలో గరిష్ఠంగా ఐదు ఫొటోలు సమర్పించవచ్చు. 30 నుంచి 60 సెకన్ల నిడివి కలిగిన షార్ట్ వర్టికల్ డ్రోన్ వీడియోలు, రెండు నుంచి మూడు నిమిషాల నిడివి కలిగిన సినిమాటిక్ ఏరియల్ ఫిల్మ్స్‌తో పాటు ఫోటోగ్రామెట్రీ, 3డీ మోడలింగ్, డిజిటల్ ట్విన్స్, వర్చువల్ టూర్స్ వంటి ప్రొఫెషనల్ డ్రోన్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.

పోటీదారులు ఒమన్ జీవనశైలి, సంస్కృతి, వారసత్వ సంపద, ప్రకృతి అందాలు, ప్రజల జీవితాలు, ఆధునిక ఒమన్ అభివృద్ధి, డ్రోన్ సాంకేతికత వంటి ఆరు అంశాల ఆధారంగా తమ సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు. ప్రారంభ స్థాయి నుంచి నిపుణుల వరకు అందరూ పాల్గొనేలా పోటీని రూపొందించారు.

ఫొటోగ్రఫీ, విజువల్ కంటెంట్ రంగాలకు చెందిన నిపుణులు, ప్రత్యేక ఇంజినీర్లతో కూడిన జ్యూరీ పోటీలో వచ్చిన ఎంట్రీలను పరిశీలిస్తుంది. ప్రతి విభాగానికి 100 పాయింట్ల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు. పోటీకి రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 30తో ముగుస్తుంది. ఎంట్రీలను సమర్పించడానికి డిసెంబర్ 8, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి 24 వరకు పరిశీలన జరగనుండగా, డిసెంబర్ 30న జరిగే అవార్డుల కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు.

ఇక ఇందులో పాల్గొనేవారు experience.ifdc.om/registrationwww ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2026లో పాల్గొనేవారే స్వయంగా చిత్రీకరించిన ఒరిజినల్ ఫొటోలు, వీడియోలను మాత్రమే సమర్పించాలి. విమానయాన, ఫొటోగ్రఫీ నిబంధనలు పాటించడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించినట్లయితే వెల్లడించాలి. అలాగే విజేతల చిత్రాలు, వీడియోలను ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక వేదికలు, డిస్కవర్ ఒమన్ బ్రాండ్ ఛానళ్లు, ఇబ్న్ ఫిర్నాస్ సెంటర్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచురించనున్నారు. తద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు ఒమన్ పర్యాటక విశేషాలను చేరువ చేయనున్నారు.

ఈ పోటీకి సంస్థలు, కంపెనీలు కూడా స్పాన్సర్లుగా భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ప్లాటినం స్పాన్సర్‌షిప్‌కు RO 5,000, గోల్డ్‌కు RO 3,000, సిల్వర్‌కు RO 1,500గా నిర్ణయించారు. మీడియా, ప్రయాణం, కమ్యూనిటీ భాగస్వామ్యాల రూపంలో కూడా సహకారం అందించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com