కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!

- November 27, 2026 , by Maagulf
కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!
కువైట్ : కువైట్‌లోని అల్ రాయ్ ప్రాంతంలో ఉన్న పక్షుల మార్కెట్‌ను శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన సమస్యలు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 డిసెంబర్ 1 నుంచి మార్కెట్ మూసివేత అమల్లోకి రానుంది. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 
 
మార్కెట్‌ను సందర్శించే ప్రజలు, అక్కడ పనిచేసే వ్యాపారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. అథారిటీ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఫాయ్ అల్ మస్బాహీ జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నంబర్ 970 ఆఫ్ 2026 ప్రకారం.. మార్కెట్‌లోని దుకాణాలను ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. గుర్తించిన ఉల్లంఘనలను సంబంధిత అధికారుల సమన్వయంతో తొలగించనున్నారు.
 
మార్కెట్‌లోని దుకాణాల యజమానులు మూసివేత నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. నిర్ణయం జారీ చేసిన తేదీ నుంచి గరిష్ఠంగా రెండు నెలల్లోగా దుకాణాలను పూర్తిగా ఖాళీ చేసి, అందులోని వస్తువులన్నింటినీ తొలగించి, అథారిటీకి చెందిన జంతు ఆరోగ్య విభాగం అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. 
 
అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని దుకాణాల లైసెన్సులను నిబంధనల ప్రకారం రద్దు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయంలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనుండటంతో అల్ రాయ్ పక్షుల మార్కెట్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com