బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!

- November 28, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
మనామా: బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్ వ్యాపారానికి సంబంధించి కీలకమైన కొత్త చట్ట ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఫుడ్ ట్రక్ నిర్వహణ లైసెన్సులు కేవలం బహ్రెయిన్ పౌరులకు మాత్రమే ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ వ్యాపారంలో విదేశీ కార్మికులను నియమించుకోవడంపై కూడా నిషేధం విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష, BD5,000 వరకు జరిమానాతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.
 
ఎంపీలు ఖలీద్ బుఅనాక్, అహ్మద్ అల్ సల్లూమ్, హిషామ్ అల్ అవాధీ ప్రతిపాదించిన ఈ బిల్లుకు పార్లమెంట్ ప్రజా సేవలు, పర్యావరణ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తదుపరి పార్లమెంట్ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరగనుంది. 2017 నుంచి అమల్లో ఉన్న జాతీయత, విదేశీ కార్మికుల నియామకానికి సంబంధించిన ఆంక్షలకు చట్టబద్ధత కల్పించడంతో పాటు నిబంధనల ఉల్లంఘనకు కఠినమైన శిక్షలు విధించేలా ఈ ప్రతిపాదనను రూపొందించారు.
 
బహ్రెయిన్ పౌరులకే లైసెన్సులు
 
ప్రతిపాదిత తొమ్మిది ఆర్టికల్స్ చట్టంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందకుండా ఎవరూ ఫుడ్ ట్రక్ నిర్వహించకూడదు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా బహ్రెయిన్ పౌరులై ఉండాలి. ఈ వ్యాపారం కోసం విదేశీ కార్మికులను నియమించుకునేందుకు అనుమతులు కూడా పొందకూడదు. లైసెన్స్ గడువు ఏడాది పాటు ఉంటుంది. అనంతరం రెన్యువల్ చేసుకోవచ్చు.
 
 కఠిన నిబంధనలు
 
ఫుడ్ ట్రక్కుల యజమానులు వాహనాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆరోగ్య, పర్యావరణ, అగ్నిప్రమాద నివారణ, రోడ్డు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. లైసెన్స్‌లో అనుమతించిన ప్రాంతాలు, సమయాల్లో మాత్రమే వ్యాపారం నిర్వహించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం జంక్షన్లు, రౌండెబౌట్లు, ట్రాఫిక్ సిగ్నళ్లకు 50 మీటర్ల దూరంలోనే ఫుడ్ ట్రక్కులను నిలపాలి. నివాస భవనాల ముందు నేరుగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు.
 
నివాస ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహించే ట్రక్కులు పక్కనున్న భవనాలకు కనీసం 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారం చేయాలి. ఆ సమయం ముగిసిన తర్వాత వాహనాలను అక్కడి నుంచి తొలగించాలి. ఎలాంటి పరికరాలు, ఫర్నిచర్‌ను అక్కడ వదిలిపెట్టకూడదు. శబ్దం చేయని జనరేటర్లను మాత్రమే ఉపయోగించాలి. భూమి యజమానుల నుంచి రాతపూర్వక అనుమతి కూడా తప్పనిసరి కానుంది.
 
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
 
కొత్త చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు మంత్రిత్వ శాఖ రాతపూర్వక హెచ్చరికలు జారీ చేయవచ్చు. లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. సాధారణ ఉల్లంఘనలను సరిదిద్దుకోవడానికి కనీసం 10 రోజుల గడువు ఇవ్వనున్నారు. 
 
అయితే ప్రజల ప్రాణాలకు లేదా ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఉల్లంఘనలు జరిగితే వెంటనే వ్యాపారాన్ని నిలిపివేసి లైసెన్సును రద్దు చేయవచ్చు. నేరానికి ఉపయోగించిన వాహనాలు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించే అధికారం కూడా ఉంటుంది. పరిపాలనా చర్యలపై వ్యాపార యజమానులు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు.
 
వివిధ శాఖల భిన్నాభిప్రాయాలు
 
ఫుడ్ ట్రక్ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం అవసరమని ఎంపీలు పేర్కొన్నారు. ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడం, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, యువ బహ్రెయిన్ పౌరులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యాలని వివరించారు. అయితే మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న మంత్రి స్థాయి నిర్ణయాలే ఈ లక్ష్యాలను సాధించడానికి సరిపోతాయని అభిప్రాయపడింది. 
 
పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యాపార నియంత్రణపై ప్రభుత్వ వర్కింగ్ గ్రూప్ సమీక్ష నిర్వహిస్తోందని తెలిపింది. మున్సిపల్ కౌన్సిళ్లలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐదు సమావేశాల అనంతరం పార్లమెంటరీ కమిటీ సవరించిన బిల్లు రూపాన్ని ఖరారు చేసింది. తదుపరి పార్లమెంట్ సమావేశంలో జరిగే ఓటింగ్‌తో ఈ ప్రతిపాదన భవిష్యత్తు తేలనుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com