పోలీసుల వలయంలో బెంగళూరు

- September 12, 2016 , by Maagulf
పోలీసుల వలయంలో బెంగళూరు

కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తమిళనాడుకు చెందిన పలు వాహనాలతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలకు నిప్పటించారు.పరిస్థితి విషమించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులు మరింతరెచ్చిపోవడంతో పోలీసులు తూటాలకు పని చెప్పారు. ఈ కాల్పుల్లో కుణిగల్ తాలుకా సింగోనహళ్ళికి చెందిన ఉమేష్ గౌడ (25) అనే యువకుడు మరణించాడు.

బెంగళూరులో కర్ఫూ
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర, కేపీ అగ్రహార, చంద్రా లేఔట్, యశవంతపుర, మహాలక్ష్మి లేఔట్, పిణ్య, ఆర్ఎంసీ యార్డు, నందిని లేఔట్, జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్, రాజగోపాలనగర, కామాక్షిపాళ్య, విజయనగర, బ్యాటరాయణపుర, కంగేరి, మాగడి రోడ్డు, రాజాజీనగర పోలీస్ స్టేషన్ ల పరిధిలో కర్ఫూ విధించారు.

 
నిఘా నిడాలో 16 పోలీస్ స్టేషన్లు
బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్ ల పరిధిలో కర్ఫూ విధించామని నగర పోలీసు కమిషనర్ మేఘరికర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 
పోలీసుల వలయంలో విక్టోరియా ఆసుపత్రి
పోలీసుల కాల్పుల్లో మరణించిన ఉమేష్ గౌడ మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులు ఆసుపత్రిలోకి ప్రవేశించకుండ పోలీసులు గట్టినిఘా వేశారు. వెయ్యి మంది పోలీసులు విక్టోరియా ఆసుపత్రిలో భద్రత కల్పిస్తున్నారు.
 
ఉమేష్ గౌడ మృతదేహానికి పోస్టుమార్టుం
మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఉమేష్ గౌడ మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.
 
ప్రజలు బయటకు రావొద్దు
కర్ఫూ జారీ అయిన ప్రాంతాల్లో ప్రజలు బయటకురాకూడదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మనవి చేశారు.
 
పోలీసుల వలయంలో బెంగళూరు
బెంగళూరు నగరంలో 15 వేల మంది పోలీసులు, 10 ప్యారా మిలటరీ బలగాలు, 30 సీఆర్ పీఎఫ్ బెటాలియన్లు, 20 కేఎస్ఆర్ పీ బెటాలియన్లు భద్రత కల్పిస్తున్నారు.
 
అనుమానం వస్తే అదుపులోకి
పోలీసులకు అనుమానం వచ్చిన వెంటనే పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
 
14వ తేదీ వరకు నిషేధాజ్ఞలు
బెంగళూరు నగరంలో ఈనెల 14వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
 
పోలీసుల అదుపులో అల్లరిమూకలు
మంగళవారం వేకువజామున నుంచి పలు ప్రాంతాల్లో పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లరిమూకలను అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com