తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభo...

- October 01, 2016 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభo...

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయం, జూబ్లీహిల్స్‌ పెద్దమతల్లి ఆలయం, బాసర సరస్వతి అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై .. 
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం భక్తులను 9గంటల నుంచి దర్శనానికి అనుమతించారు.

వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడి ఈవో సూర్యకుమారి పూజల్లో పాల్గొన్నారు. 11రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 9గంటల వరకూ క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా జేగంటను మోగించారు. దుర్గమ్మకు భక్తులు చేయించిన కొత్త ఆభరణాలను దసరా ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా నాలుగున్నర కోట్ల రూపాయలతో చేయించిన స్వర్ణకవచం, వజ్రకిరీటం, త్రిశూలంతో అమ్మవారిని అంలకరించారు. 10రోజుల క్రితమే అమ్మవారి అంతరాలయం, తలుపులకు స్వర్ణతాపడం చేయించారు. ఇ ప్పుడు అమ్మవారికి సైతం పూర్తిస్థాయిలో ఆభరణాలు రావటంతో దుర్గమ్మ నిజంగానే కనకదుర్గమ్మగా భక్తులకు సాక్షాత్కరిస్తోంది. నాలుగు వరుసల్లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కొందరు భక్తులు దుర్గాఘాట్ లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
 
భద్రకాళీ ఆలయంలో .. 
వరంగల్‌: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వేదమంత్రోచ్ఛరణ నడుమ సహస్రకలశాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, కుంకుమతో పాటు వివిధ రకాల సుగంధ ధ్రవ్యలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అభిషేక ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రారంగణం మారుమోగింది. అంతకు ముందు ఆలయాన్ని బంతి, చామంతి, వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు.
 
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో .. 
హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం అభిషేకంతో ప్రత్యేక పూజలు ఆరంభమయ్యాయి. పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో అవతారంలో పెద్దమ్మ తల్లిని అలంకరించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com