లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ సేవల అమలు...

- October 06, 2016 , by Maagulf
లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ సేవల అమలు...

రాజధానిలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దశాబ్దం కిందట ప్రతిపాదించిన తేలికపాటి రైలు (లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) సేవల అమలుకు సన్నాహాలు నెమ్మదిగా ఆరంభమయ్యాయి. తొలి దశలో 42 కిలోమీటర్ల నిడివిలో లైట్‌ రైల్‌ నడపుతారు. 'బెంగళూరు ఎయిర్‌ పోర్టు లింక్‌ లిమిటెడ్‌ సంస్థ' ఈ పథకం వివరణాత్మక సమగ్ర నివేదికను తయారు చేస్తోంది. అదే సంస్థ లైట్‌రైల్‌ పథకాన్ని అమలు చేయనుందని నగరాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. జేపీ నగర్‌- హెబ్బాళ ఆవల వర్తుల మార్గం వరకూ, మాగడి రహదారి టోల్‌ గేట్‌ నుంచి పెరిఫెరల్‌ వర్తుల మార్గం వరకూ వరుసగా 31.3, 10.6 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మిస్తారు.వీటి పరిధిలో మొత్తం 24, 11 స్టేషన్లు ఉంటాయి. మెట్రో కంటే ఇది విభిన్నమైంది. మెట్రో కంటే చిన్న చిన్న స్టేషన్లు నిర్మిస్తారు. మెట్రో కంటే ఏడు శాతం ఎక్కువ ఏట వాలు ప్రాంతంలో తేలిగ్గా బుల్లి రైలు ప్రయాణిస్తుంది.ప్రతి రైలుకూ మూడు పెట్టెలు ఉంటాయి. ఒకటిన్నర నిముషానికో రైల్‌ స్టేషన్లో ఆగుతుంది. పట్టాల నిర్మాణానికి 265 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 205 ఎకరాలు ప్రభుత్వానిదే.మిగిలినది ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి సమీకరిస్తారు. నిర్మాణం మొదలైన నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. అంచనా వ్యయం రూ.11,500 కోట్లు. ఇందులో 40 శాతాన్ని ప్రైవేటు సంస్థల నుంచి సమీకరించదలచినట్లు అధికార వర్గాలు తెలిపాయి.గత నెల మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పథకానికి పచ్చ జెండా వూపిన తర్వాత అధికార యంత్రాంగం నిధుల సమీకరణ వైపు దృష్టిని మళ్లించింది. లైట్‌ రైల్‌ సంచరించే ప్రాంతాల్ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఆ పరిసారాల్లో జరిగే నిర్మాణాల నుంచి అభివృద్ధి రుసుముల్ని, సుంకాల్ని అదనంగా వసూలు చేయదలుస్తోంది. ఏటా ఈ పద్ధతిలో రూ.1225 కోట్లు వసూలు చేయవచ్చని మదింపు వేశారు.లైట్‌ రైల్‌ మార్గ పరిసరాల్ని ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతంలో స్థిరాస్తి విలువలు గణనీయంగా పెరుగుతాయనటంలో సందేహం లేదు. దీన్నుంచి ప్రభుత్వం లబ్ధి పొందదలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో కూడా పథకం అమలు వ్యవధి, నిధుల సమీకరణ, దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత విపులంగా ప్రస్తావించనుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com