'ఆమె అతడైతే..'. చిత్రం ఆడియో విడుదల

- October 18, 2016 , by Maagulf
'ఆమె అతడైతే..'. చిత్రం ఆడియో విడుదల

క్లాసికల్‌ డ్యాన్సర్‌గా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన హనీష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'ఆమె అతడైతే..'. హనీష్‌ సరసన చిరాశ్రీ కథానాయికగా నాయికగా నటించంది. కె.సూర్యనారాయణ దర్శకుడు. శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ సం యుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా దాసరి మాట్లాడుతూ, 'బడ్జెట్‌ సినిమాలు బాగా తీసినా థియేటర్స్‌ దొరకడం లేదు. దాంతో బడ్జెట్‌కు రెట్టింపు ఖర్చు పెట్టి విడుదల చేయాల్సి ఉంటోంది. ఇలాంటి బడ్జెట్‌ సినిమాలను టీవీలో కూడా చూడలేకపోతున్నాం.దానికి కారణం శాటి లైట్‌ హక్కులు కూడా అమ్ముడు కాకపో వడమే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఆలోచన టీవీ యాజమాన్యాలకు లేకపోవడం బాధాకరం. పెద్ద సినిమాల స్థాయిలో బడ్జెట్‌ సినిమాలు ప్రమోషన్స్‌కు ఖర్చు పెట్టలేవు. చిన్న సినిమాల సక్సెస్‌కు కారణం మౌత్‌టాక్‌. అందుకే నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇది హీరోకు బ్రేక్‌నిచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. పాటలు చాలా బావున్నాయి. యశోకృష్ణ మంచి సంగీతాన్ని అందించారు. నాకు ఇందులో మూడు పాటలు నచ్చాయి. సుద్దాల అశోక్‌తేజ చాలా మంచి పాటలు రాశారు. ఈ చిత్రంలోని నాన్న పాటకు జాతీయ అవార్డు రావడం ఖాయం అనిపిస్తోంది' అని అన్నారు. 
దర్శకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ, 'తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న గ్రామీణ నేపథ్యం కలిగిన ఓ కుర్రాడు కలెక్టర్‌ కావాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నెరవేర్చాడన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. తన లక్ష్యం కోసం సిటీకి వచ్చిన ఆ కుర్రాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే అంశాన్ని ఆవిష్కరిస్తూ, పూర్తి వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
విభిన్నమైన టైటిల్‌తో కథకు సరిపోయే విధంగా ఈ సినిమా ఉంటుంది. హీరోగా హనీష్‌ అద్భుతమైన నటనను కనబరిచారు. కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ ఇందులో హీరోయిన్‌గా నటించింది' అని చెప్పారు.హీరో హనీష్‌ మాట్లాడుతూ, 'నేను సినిమా హీరోగా నటిస్తానని అనుకోలేదు. కానీ దర్శక, నిర్మాతలు నాపై నమ్మకంతో నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను' అని అన్నారు.నిర్మాతలు మారుతీప్రసాద్‌, రాధాకృష్ణ మాట్లాడుతూ, రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్‌, భరద్వాజ, సంగీత దర్శకుడు యశోకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com