దుబాయ్‌లో 55 కోట్లతో ప్రవాసీ పరార్
- October 19, 2016
దేశంకాని దేశంలో ఓ తెలుగువాడు కనిపించి పలకరిస్తే హ్యాపీగా ఫీలవుతాం. అలాంటిది కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఇంటికి పిలిపించుకొని రాచమర్యాదలు చేస్తే, చక్కని తెలుగులో మాట్లాడుతూ ఆప్యాయతలు ఒలకబోస్తే ఫిదా అవకుండా ఉంటామా? సౌదీలో రెండేళ్ల క్రితం స్థిరపడ్డ ఓ తెలుగాయన తోటి తెలుగువారిని ఈ విధంగానే ఆకర్షించాడు. తన భార్య పేరిట ఓ ఇండస్ట్రీన నడుపుతూ పెట్టుబడులను ఆహ్వానించాడు. ప్రతిగా భారీగా లాభాలు, వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపాడు. అతని రాచభవనం లాంటి ఇల్లు అదీ చూసి నమ్మకంకొద్దీ కొందరు అతని వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. చెప్పినట్లుగానే వారికి పెద్ద మొత్తంలో లాభాలు పంచిపెట్టాడతను. దీంతో అక్కడ స్థిరపడ్డ తెలుగువారంతా లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టారు. అయితే.. అందినకాడికి అంతా మూటగట్టుక్కున్న ఆ వ్యక్తి సమయం చూసుకొని దుబాయ్ నుంచి భారతకు చెక్కేశాడు! దీంతో బాధితులంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఆ ప్రవాసాంధ్ర ‘ఆషాఢభూతి’ కొల్లగొట్టిన సొమ్ము ఎంతో తెలుసా? ఏకంగా 55 కోట్లు!!
కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని రాఘవరాజుపురానికి చెందిన చామర్తి వెంకట రామరాజు సౌదీలో స్థిరపడ్డాడు. సంపన్నులు నివసించే అత్యంత ఖరీదైన ప్రాంతం అరేబియన్ రాంచ్లో కళ్లుచెదిరేస్థాయిలో 6,850 చదరపు అడుగుల ఇంట్లో ఉంటున్నాడు. రెండేళ్లుగా షార్జాలో తన భార్య పేరిట ఎయిర్ కండీషన్డ్ పరికరాలకు సంబంధించిన పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. అనతికాలంలోనే సీవీఆర్గా దుబాయ్, షార్జా, అబుదాబిలోని తెలుగు ప్రవాసీ పెద్ద మనుషులతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తన వ్యాపారంలో పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో కొందరు తమ సొత్తంతా అతని చేతిలో పెడితే.. ఇంకొందరు బ్యాంకుల్లో అప్పుచేసి మరీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రముఖుడు ఏకంగా సీవీఆర్ వ్యాపారంలో రూ.6.34 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతని దగ్గరపనిచేసే తెలుగు రాష్ర్టాలకు చెందిన ఉద్యోగులు కూడా అధిక వడ్డీలకు ఆశపడి బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని మరీ యాజమానికి ధారపోశారు. ఈ రకంగా వివిధ బ్యాంకుల నుంచి 20 మిలియన్లు, తెలిసిన వ్యక్తుల నుంచి మరో 10 మిలియన్ల దిర్హాంలను అతను స్వాహా చేసినట్లుగా విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీవీఆర్ చేతిలో మోసపోయిన అనేక మంది వివిధ కారణాల దృష్ట్యా తమ పేర్లను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. ఓ తెలుగు ప్రముఖుడైతే 20 చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చాడని చెబుతున్నారు. కాగా కొన్ని నెలలుగా వ్యూహాత్మక వ్యవహరించిన సీవీఆర్.. సేకరించిన నిధులన్నీ బయటకు తరలించాడని అనుమానిస్తున్నారు. అతను మూడు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేదని తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి కుటుంబంతో కలిసి భారత్ కు వెళ్లిపోయాడని తెలిసింది. అతని వద్ద పని చేస్తున్న తోడల్లుడైన ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఒక మండల రెవెన్యూ అధికారిణి భర్త. ఇతర బంధువులు కూడా స్వదేశానికి చెక్కేశారని సమాచారం. ఫోన్లన్నీ స్విచాఫ్ చేసి ఉండటం, దుబాయ్‌లోని ఖరీదైన ఇంట్లో ఎవరూ లేకపోవడం, రైల్వేకోడూరులోని అతని తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేకపోవడంతో బాధితులు తాము మోసపోయినట్లుగా గ్రహించారు. ఈ మేరకు దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్‌కు ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల పోలీసులకూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు ప్రవాసీయులకు కుచ్చుటోపీ పెట్టేక్రమంలో సీవీఆర్ ఒకప్పటి తన యజమానినే ఆదర్శంగా తీసుకున్నాడు. ప్రవాసీ పారిశ్రామికవేత్త, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రసాద్ రెడ్డి ఐదేళ్ల క్రితం షార్జా నగరం నుంచి వివిధ వర్గాల నుంచి సేకరించిన సుమారు రూ.120 కోట్లతో ఉడాయించాడు. అప్పట్లో అతని వద్ద పని చేసిన కార్మికులు ఆజ్మాన్‌లో ఆకలితో అలమటించగా సాయిబాబా భక్తులు వారికి ఆహారం అందించారు. ప్రసాద్ రెడ్డికి చెందిన అల్ నూర్ ప్లాంటులో అప్పట్లో మేనేజర్‌గా సీవీఆర్ పని చేసాడని కొందరు బాధితులు చెబుతున్నారు. అప్పట్లో తన యాజమాని మాదిరిగానే మోసం చేశాడని లబోదిబోమంటున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







