ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!

- July 22, 2026 , by Maagulf
ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!

దోహా: ప్రపంచంలోనే అగ్రగామి సహజ వాయువు (గ్యాస్) ఉత్పత్తి దేశమైన ఖతర్‌కు భారత నూతన రాయబారిగా తెలుగు ఐఎఫ్‌ఎస్ అధికారి డాక్టర్ కొప్పుల శ్రీకర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2001 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవ (IFS) అధికారిగా ఉన్న ఆయనను ఖతర్‌లో భారత రాయబారిగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకర్ రెడ్డి, విదేశాంగ సేవలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా పనిచేసిన ఆయన, పాస్‌పోర్టు పోలీసు ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పాస్‌పోర్టులు జారీ చేసే విధానాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కృషికి గాను దేశవ్యాప్తంగా ప్రశంసలు, ఉత్తమ అవార్డును అందుకున్నారు.

అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్య రంగాల్లో విశేష అనుభవం కలిగిన శ్రీకర్ రెడ్డి, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో భారత ప్రతినిధిగా కూడా సేవలందించారు. ఆఫ్రికా, అరబ్ దేశాలతో భారత్ కుదుర్చుకున్న పలు కీలక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. భారత్–యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) రూపకల్పనలో కూడా భారత బృందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖలో పాకిస్థాన్‌కు సంబంధించిన కీలక వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించారు. వియత్నాం, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వివిధ దౌత్య బాధ్యతలు నిర్వహించి విశేష అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలానికి చెందిన డాక్టర్ శ్రీకర్ రెడ్డి, వరంగల్‌లో వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం 2001లో సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఆయన సతీమణి ప్రతిమ కూడా ఉన్నత విద్యావంతురాలు.

భారత్‌కు ఇంధన భద్రత, ఎరువుల తయారీ, విద్యుత్ రంగాల్లో ఖతర్ కీలక భాగస్వామి. అలాగే ఖతర్‌లో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖతర్‌లో భారత రాయబారి పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

డాక్టర్ శ్రీకర్ రెడ్డి నియామకంపై ఖతర్‌లోని తెలుగు ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖతర్‌లో భారత రాయబారిగా ఉన్న విపుల్ ఈ నెలాఖరులో తన పదవీకాలాన్ని ముగించనున్న నేపథ్యంలో, అనంతరం డాక్టర్ శ్రీకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com