రివ్యూ: కాష్మోరా!
- October 28, 2016
చిత్రం: కాష్మోరా
నటీనటులు: కార్తీ.. నయనతార.. శ్రీదివ్య.. వివేక్.. శరత్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
కూర్పు: వి.జె.సాబు జోసెఫ్
నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, ప్రసాద్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు
దర్శకత్వం: గోకుల్
సంస్థ: పి.వి.పి సినిమాస్.
విడుదల: 28-10-2016
తె లుగులో మంచి మార్కెట్‌ని సంపాదించుకొన్నారు కార్తీ. ఆయన నటించిన సినిమాలనగానే తెలుగు స్టార్ కథానాయకుల చిత్రాలతో సమానంగా అంచనాలు ఏర్పడుతుంటాయి. 'కాష్మోరా' విషయంలోనూ అలాంటి భావనే ఉంది. 'బాహుబలి'ని తలపించే విజువల్ ఎఫెక్ట్స్, కార్తీ విభిన్నమైన గెటప్పులు ప్రచార చిత్రంలో కనిపించడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: ప్రేతాత్మల నుంచి విముక్తి కల్పిస్తానంటూ మేజిక్కులు చేస్తూ బతికేస్తుంటాడు క్యాష్ అలియాస్ కాష్మోరా(కార్తీ). తనకి శక్తులేవీ లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంటాడు. అతడికి సొంత కుటుంబం కూడా తోడుంటుంది. ఆత్మల పేరుతో చేతివాటం ప్రదర్శించే కాష్మోరా ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ తమ కుటుంబ సభ్యులంతా రోహిణి నక్షత్రంలో పుట్టామని, అందుకే తమకి ఈ శక్తులు అబ్బాయని చెబుతాడు. అదే విషయాన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకొంటుంటాడు. నిజంగానే ప్రేతాత్మ అయిన రాజ్‌నాయక్ (కార్తీ)కి ఆ ప్రకటన గురించి ఎలా తెలుస్తుంది? రాజ్‌నాయక్ ప్రేతాత్మలా మారిపోవడానికి కారణమేమిటి? 700 యేళ్ల క్రితంనాటి అతని చరిత్ర ఎలాంటిది? రోహిణి నక్షత్రంలో పుట్టిన కాష్మోరా కుటుంబాన్ని రాజ్‌నాయక్ ఆత్మ తన దగ్గరికి రప్పించుకొని ఏం చేసింది? ఈ కథతో యామిని (శ్రీదివ్య) అనే పరిశోధక విద్యార్థినికీ, రత్నమహాదేవి (నయనతార)కీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: ఇదొక ఫాంటసీ కథ. 700 ఏళ్ల క్రితం నాటి కథకీ, అప్పటి ఓ శాపానికీ, ప్రస్తుతం భూత వైద్యుడిగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీసే ఓ కుటుంబానికీ మధ్య ముడిపెట్టి కథని అల్లారు. తొలి సగభాగం కథంతా ఆత్మల్ని పైకి పంపిస్తానంటూ కాష్మోరా పాత్రలో కార్తీ, ఆయన తండ్రి పాత్రలో వివేక్ చేసే మేజిక్కులతోనే సాగిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్వించేలా తీర్చిదిద్దారు. భూతం ఉందంటూ నమ్మించేందుకు రిమోట్ కంట్రోల్‌తో కూడిన పరికరాలతో కాష్మోరా కుటుంబమంతా చేసే విన్యాసాలు కూడా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతాయి. కాష్మోరా కుటుంబమంతా రాజ్‌నాయక్ బంగ్లాకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. రాజ్‌నాయక్ ఎందుకు ప్రేతాత్మగా మారాడో, అతనికి పునరుజ్జీవం రావడానికి తమ కుటుంబం ఎలా కీలకమో కాష్మోరాకి తెలిసే క్రమం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 700 ఏళ్ల క్రితం నాటి రాజ్యాన్ని, అప్పటి యుద్ధాన్ని, రాజ్‌నాయక్ పరాక్రమాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అప్పటి రాజ్యాన్ని విజువల్ ఎఫెక్ట్స్‌తో కళ్లకు కట్టిన తీరు చాలా బాగుంది. 'బాహుబలి' స్థాయి ఎఫెక్ట్స్ ఆ సన్నివేశాల్లో కనిపిస్తాయి. ఒక ఆత్మ కథని... ఫాంటసీతో ముడిపెట్టి తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కథని అల్లుకొన్నవిధానం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది. అయితే తొలి సగభాగంలోని కామెడీలో కొంచెం కూడా మలి సగభాగంలో లేకపోవడమే ప్రేక్షకులకి కాస్త లోటు అనిపిస్తుంది. కథంతా కూడా మలి సగభాగంలో చెప్పాల్సి రావడమే అందుకు కారణం. అక్కడక్కడా సన్నివేశాల్లో స్పష్టత లోపించినట్టు అనిపించినా ఆసక్తి మాత్రం చివరి వరకు కొనసాగుతుంది.
ఎవరెలా చేశారంటే?: కార్తీ నటనే సినిమాకి ప్రధాన బలం. ఆయన మూడు కోణాల్లో కనిపిస్తూ ప్రతీ సన్నివేశంలోనూ సందడి చేస్తుంటారు. కానీ కథానాయికలకి అసలేమాత్రం ప్రాధాన్యం లేదు. రెండో సగభాగంలోనే నయనతార తెరపైకొచ్చినా ఉన్నంతలో ఆమే ఎక్కువసేపు కనిపిస్తుంది. శ్రీదివ్యకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లేదు. కార్తీ తండ్రిగా కనిపిస్తూ వివేక్ చాలా సన్నివేశాల్లో నవ్వించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. రాజ్‌నాయక్ పాత్రలో కార్తీ చేసే సందడి చాలా బాగుంది. కాష్మోరా పాత్రలో మంచి టైమింగ్‌ని ప్రదర్శించి నవ్వించారు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణ్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా కుదిరాయి. దర్శకుడు గోకుల్‌కి ఇది మూడో సినిమానే అయినా ఎంతో పరిణతిని కనబరుస్తూ తెరకెక్కించారు. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
బలాలు
+ కార్తీ నటన
+ కామెడీ
+ 700 ఏళ్ల క్రితం ఎపిసోడ్
బలహీనతలు
- మలి సగభాగంలో వినోదం లేకపోవడం
చివరిగా: నవ్విస్తూ, థ్రిల్నిస్తూ సాగే 'కాష్మోరా'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







