లెక్కకు మించి డబ్బులున్నవారిని వదిలే ప్రసక్తే లేదు : మోదీ
- November 12, 2016
'లెక్కకు మించి డబ్బులున్నవారిని వదిలే ప్రసక్తే లేదు. డిసెంబరు 30 తర్వాత ఎలాంటి చర్యలూ ఉండబోవనుకుంటున్నారేమో.. మిమ్మల్ని (నల్లకుబేరులను) శిక్షించడానికి సరికొత్త చర్యలు ఉండబోవన్న గ్యారెంటీ ఏమీ లేదు. ప్రపంచం మారింది. మీకు కొంత సమయం ఇచ్చాను. నల్ల డబ్బు బయటపెట్టేదీ లేనిదీ మీ ఇష్టం. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి'' జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ భారత్‌లోని నల్లధన కుబేరులకు చేసిన హెచ్చరిక ఇది. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం దీనిని ప్రస్తావిస్తూ... తొలిసారిగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. నిజాయతీపరులైనవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని మరోసారి భరోసా ఇచ్చారు.
డిసెంబరు 30 వరకు అమల్లో ఉండే ప్రస్తుత పథకం ముగిసిపోయిన తర్వాత నల్లకుబేరుల్ని శిక్షించడానికి మరేదైనా కొత్త చర్యలు ఉండవచ్చని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
లెక్కల్లో లేని డబ్బు బయటకు వస్తే మాత్రం స్వాతంత్య్రం వచ్చినప్పటి రికార్డులనైనా తవ్వి తీస్తా. ఇందుకు ఎన్ని మానవ వనరులు కావాలన్నా నియమిస్తా. ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు. నా గురించి తెలిసినవాళ్లు.. తమ దగ్గరున్న డబ్బు బ్యాంకుల్లో వేయడం కన్నా గంగానదికి అర్పించడం మంచిదని భావించారు. వారు నిజంగా చాలా తెలివైనవాళ్లు'' అని నల్లధనాన్ని పారేస్తున్న వ్యక్తులను ఉద్దేశించి అన్నారు. ఈ నిర్ణయమే లేకపోతే వారిలో ఎవరూ గంగలో పావలా కూడా వేయరని చమత్కరించారు. ఆదాయ వెల్లడి పథకంలో 67 వేల కోట్లు బయటపడినప్పుడు కూడా మోదీ విఫలమయ్యాడని చాలా మంది అన్నారని.. కానీ గత రెండేళ్లలో తమ ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికితీసిందని ప్రధాని గుర్తుచేశారు.
భారతదేశ ఆర్థిక రంగం వేగంగా వృద్ధి చెందుతున్న తీరును ప్రపంచం గుర్తిస్తోందని మోదీ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరంగా దేశం సరికొత్త చరిత్ర సృష్టిస్తోందనీ, ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా భారత్‌ను వెలుగుతున్న ధ్రువతారగా విశ్వసిస్తున్నాయనీ తెలిపారు. ఎఫ్‌డీఐ అంటే 'ఫస్ట్ డెవలప్ ఇండియా' (మొదట భారత్ అభివృద్ధి) అనే నిర్వచనాన్నీ తాను ఇస్తున్నానని చెప్పారు.జపాన్ పారిశ్రామికవేత్తల్ని ఉద్దేశించి విందు సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.
ముఖ్యంగా సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల రంగంలో ఇరుదేశాలూ లబ్ధి పొందవచ్చని చెప్పారు. రూపాంతరీకరణ దిశగా తాము అడుగులు వేస్తున్నామన్నారు. టోక్యో నుంచి కోబెకు జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి షింకన్‌సేన్ బులెట్‌రైల్లో ఆయన ప్రయాణించారు. గంటకు 240-320 కి.మీ. వేగంతో వెళ్లే ఇలాంటి రైళ్లను 2023 నాటికి ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య ప్రవేశపెట్టనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







