రివ్యూ : జయమ్ము నిశ్చయమ్మురా

- November 24, 2016 , by Maagulf
రివ్యూ   : జయమ్ము నిశ్చయమ్మురా

రివ్యూ             : జయమ్ము నిశ్చయమ్మురా
తారాగణం           : శ్రీనివాసరెడ్డి, పూర్ణ, కృష్ణభగవాన్, శ్రీ విష్ణు, ప్రవీణ్, జీవా, పోసాని కృష్ణమురళి, రవివర్మ, జోగి బ్రదర్స్, డబ్బింగ్ జానకి, నారాయణ తదితరులు
ఎడిటింగ్        : వెంకట్
సినిమాటోగ్రఫీ    : నాగేశ్ బానెల్
సంగీతం        : రవిచంద్ర
నిర్మాతలు          : శివరాజ్ కనుమూరి, సతిష్ కనుమూరి
రచన, దర్శకత్వం  : శివరాజ్ కనుమూరి
విడుదల తేదీ       : 25.11.16

ఒకే ఒక్క పాటతో మొత్తం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న టీమ్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’. కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా చేసిన రెండో సినిమా ఇది.. అంచనాలు పెంచడమే కాదు.. వైవిధ్యమైన ప్రమోషన్ తో వేగంగా దూసుకుపోయింది.. ఆ మేరకు మంచి బిజినెస్ ను కూడా సంపాదించుకుందీ టీమ్. మొత్తంగా విడుదలకు ముందే విజయకళ కనిపించిన జయమ్ము నిశ్చయమ్మురా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంలో ఏ మేరకు సక్సెస్ అయిందో చూద్దాం.. 

కథ    : 
సర్వమంగళం( శ్రీనివాసరెడ్డి) కి మూఢవిశ్వాసాలు ఎక్కువ.. పైగా భయస్తుడు. ప్రతిదానికీ ఓ దొంగ బాబా(జీవా)పై ఆధారపడుతుంటాడు.. పదేళ్లుగా ఉద్యోగం కోసం చూస్తోన్న అతనికి బాబా సలహాలతో ఉద్యోగం వస్తుంది( అనుకుంటాడు). కాకినాడ మున్సిపల్ ఆఫీస్ లో క్లర్క్ గా వెళతాడు. అక్కడ రకరకాల సహోద్యోగులు కనిపిస్తారతనికి.. తన పై ఆఫీసర్ జే.సి(రవివర్మ) స్త్రీ లోలుడు. అందుకోసం అతను సర్వమంగళం ఉంటోన్న ఇంటినే వాడుతుంటాడు. అయితే అంతకు ముందే అతను హైదరాబాద్ లో రాణి(పూర్ణ)ని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు.. తీరా చూస్తే ఆ రాణి  తను పనిచేసే ఆఫీస్ పక్కనే మీసేవాలో పనిచేస్తుంటుంది. ఇక ఎలాగైనా రాణిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అనుకోకుండా రాణి నర్సరీ కోసం అప్లై చేసుకున్న ఫైల్ అతనివద్దకే వస్తుంది. అప్పటినుంచి ఆమెతో చనువు పెంచుకుని తన ప్రేమనుచెప్పాలనుకుంటాడు. కానీ ఓ రోజు రాణి తన పై ఆఫీసర్ జేసితో కలిసి తన రూమ్ కు వస్తుంది.. దీంతో షాక్ తిన్న సర్వమంగళం ఏం చేశాడు. రాణి నిజంగానే తప్పు చేసిందా.. ? ఆ తర్వాత రాణితో సర్వమంగళం ‘స్నేహం’ ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది మిగతా కథ..

విశ్లేషణ    : 
తెలుగులో ఇలాంటి సినిమా వచ్చి చాలాకాలమైంది.. చాలామంది కంటే ముందే సినిమా చూశాక దర్శకుడు కొరటాల శివ అన్న మాటలివి.. అతను చెప్పాడని కాదు.. కానీ నిజంగా ఇది అలాంటి సినిమానే చూస్తున్నంత సేపూ లీనమైపోతారు.. చెప్పడానికి ఓ సాధారణ ప్రేమకథే. కానీ ఆ కథ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. రాసుకున్న పాత్రలు, వారి ప్రవర్తనా విధానం.. మన చుట్టూ కనిపిస్తున్న మనుషుల్లాగే ఉంటాయి. మనుషుల బలాలు, బలహీనతలు, అనుబంధాలు, అపార్థాలు, ఆకర్షణ.. ప్రేమల మధ్య ఉండే తేడాలు.. చెప్పుడు మాటల చేటు, డబ్బుకోసం ఎలాంటి పనికైనా దిగజారే మనుషులు, నిజాయితీని నమ్ముకుంటే ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ సినిమాలో కనిపించని అంశమే ఉండదు. చాలాయేళ్ల క్రితం వంశీ, రాజేంద్ర ప్రసాద్ ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్ని గుర్తుకు తెస్తుందీ సినిమా. అలాగని వాటితో పోలిక కూడా లేదు. సహజమైన పాత్రలు.. సన్నివేశాలు.. అంతే సహజమైన లొకేషన్స్ .. ఈ సినిమాకు ప్రాణం. చిత్రంగా దర్శకుడు ఎంచుకున్న ప్రతి నటుడు.. ఆయా పాత్రల్లో జీవించేశారు.. ఒక ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ అల్లుకున్న కథలో మనం ఇప్పటి వరకూ చూసిన సన్నివేశాలకు భిన్నమైన ఎన్నో ‘వేషాలు’ ఇందులో కనిపిస్తాయి.. మరికొన్ని సార్లు వేసవిలో ఓ పౌర్ణమిరాత్రి గోదావరి తీరంలో ఇసుకలో కూర్చుని ఆ వెన్నెల గోదారిని చూస్తున్న అనుభూతి కూడా కలుగుతుంది.. అందుకే ‘అసలు సర్వమంగళంతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో కూడా తెలియదు’ అంటుంది హీరోయిన్.. కారణం.. కథ కృత్రిమంగా కాక ప్రవాహంలా సాగుతుంది. ఆ ప్రవాహం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ప్రయాణం మైమరపిస్తుంది.. అలా హీరోయిన్ కు కనిపించినవే జే.సిలో కాముకత్వం, సర్వమంగళం ప్రేమ. అటు సర్వమంగళం కూడా అంతే.. స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టే.. జేసి ఏంటో తెలుసు కాబట్టి.. రాణిని పార్థం చేసుకోకుండా అభాసు పాలు కాకుండా చూసుకుంటాడు.. మరోవైపు కృష్ణ భగవాన్, పోసాని, ప్రవీణ్, జోగి బ్రదర్స్ నవ్వుల సునామీ పొట్టచెక్కలు చేస్తూ ఉంటుంది.. ఓ ప్రభుత్వ ఆఫీస్.. అందులో స్టాఫ్. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన మనస్తత్వం.. బాస్ ను కాకాపట్టి పబ్బం గడుపుకునేవారు.. లంచం కోసం బ్రోకర్స్ తో మిలాఖత్ అయి సామాన్యులను ఇబ్బంది పెట్టేవారు.. ఇలా ప్రతి పాత్రకూ ఓ ఔన్యత్యం... ప్రాధాన్యతా ఉంటాయి. అందుకే ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి ‘హీరో’లా కనిపించడు. తన ప్రపంచంలో తన చుట్టూ ఉన్న మనుషుల్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా కనిపిస్తాడు. దాన్నే మనం హీరో పాత్రగా అనుకోవచ్చు. 
మొదటి భాగం సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మూఢనమ్మకాలతో ప్రేమను గెలవాలనుకున్న అతని పాత్ర ముందు ఇబ్బంది పెడుతుంది. కానీ ఎప్పుడైతే ‘మూఢత్వపు ముసుగు’ తొలగుతుందో.. అప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కంటిన్యూస్ గా నవ్వులతో పాటు సర్వమంగళం అంటే మనమే అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోతాం.. ఇక జే.సీ తో ఢీ కొట్టే సన్నివేశాల్లో హీరోయిజానికి అర్థమే మార్చివేస్తాడు దర్శకుడు.. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకూ కళ్లు తిప్పుకోనీయకుండా తీసుకువెళుతుంది కథనం.. నెక్ట్స్ ఏం జరగబోతోందా అనే ఉత్కంఠ ఉండదు. కానీ ప్రతి సీన్ నూ ఆస్వాదిస్తాం. ఇక్కడ ఫైట్.. ఇక్కడ పాట లాంటి పనికిమాలిన లాజిక్స్ కు పక్కనబెట్టి.. అన్నిటినీ కథలో భాగం చేసిన దర్శకుడిని హ్యాట్సాఫ్ చెప్పుకుండా ఉండలేం. ఇలాంటి జానర్ ను ఎంచుకుని మెప్పించడం అంటే ఇప్పటి ట్రెండ్ లో సాహసమే. సత్తా ఉన్నవాడు సాహసం చేస్తే సాధిస్తాడు అనేదానికి సరైన ఉదాహరణ ఈ చిత్ర దర్శకుడు శివరాజ్.. 
ఆర్టిస్టుల పరంగా ఎవర్నీ తక్కువ చేయలేం. ముఖ్యంగా ఈ సినిమాలో మనకు శ్రీనివాసరెడ్డి కనిపించడు. మొదలైన దగ్గర్నుంచీ సర్వమంగళమే కనిపిస్తాడు. కృష్ణభగవాన్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా.. హిలేరియస్ గా నవ్విస్తాడు.. సాధారణంగా బూతులా ధ్వనించే ‘‘మంగళవారం’’ ఎపిసోడ్ ను పొట్టచెక్కలయ్యేలా తీర్చిదిద్దారు. తత్కాల్ గా ప్రవీణ్, పోసాని, జీవా, జోగి బ్రదర్స్.. జేసి పాత్రలో రవివర్మ.. అందరూ జస్ట్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యారంతే... 
ఇలాంటి సినిమాలో మైనస్ వెదకడమో చెప్పడమో కంటే.. మారుతున్న తెలుగు సినిమా ట్రెండ్ ను లేదా పాత ట్రెండ్ కు వెళుతూ మళ్లీ సహజ చిత్రాలు రావడానికి మొదలైన ‘బాట’ను ఆహ్వానించాలి.. నిడివి ఎక్కువైందనే మాట.. సినిమా చూశాక అనలేం.. నిజానికి 80ల్లో హవా చేసిన జానర్ ఇది. దానికి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేసిన దర్శకుడు, నిర్మాత శివరాజ్ కనుమూరి టాలెంట్ కు ఫిదా అయిపోతాం..  

ఫైనల్ గా : మండువేసవిలో నిండుపున్నమిలో గోదావరిలో లాంచీ ప్రయాణం చేయాలనుకుని.. కుదరకపోతే.. కుటుంబ సమేతంగా ఈ సినిమాకు వెళ్లండి.. ఆ ఫీల్ ను అనుభూతి చెందుతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com