భేతాళుడు : రివ్యూ

- December 01, 2016 , by Maagulf
భేతాళుడు : రివ్యూ

చిత్రం పేరు: భేతాళుడు 
నటీనటులు: విజయ్‌ ఆంటోనీ.. అరుంధతి నాయర్‌.. చారుహాసన్‌.. మహేంద్ర.. కమల్‌ కృష్ణ.. కిట్టీ.. తదితరులు 
సంగీతం: విజయ్‌ ఆంటోనీ 
ఛాయాగ్రహణం: ప్రదీప్‌ కలిపురయత్‌ 
కూర్పు: వీర సెంథిల్‌ రాజ్‌ 
నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటోనీ, మల్కాపురం శివకుమార్‌ 
దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి 
సంస్థ: మాసన్‌ రుషి ఎంటర్‌ ప్రైజెస్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్‌ 
విడుదల: 1 డిసెంబరు 2016
విజయ్‌ ఆంటోనీ...

ఈ తమిళ కథానాయకుడు తెలుగులోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. విభిన్నమైన కథల్ని ఎంచుకొని, కథలనే హీరోగా నిలబెట్టి, తన పాత్రని రక్తికట్టించి సినిమాని 'పాస్‌' చేయించుకొంటున్నాడు. ఇటీవల విడుదలైన 'బిచ్చగాడు' తెలుగునాట వూహించని రీతిలో వసూళ్లు అందుకొంది. ఇప్పుడు అతన్నుంచి వచ్చిన సినిమా 'సైతాన్‌'. తెలుగులో 'భేతాళుడు' పేరుతో విడుదల చేశారు. మరి విజయ్‌ ఆంటోనీ తన ప్రత్యేకతని నిలుపుకొన్నాడా? ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ 'భేతాళుడు' ఎవరు? తెలుసుకొందాం.. రండి.
కథేంటి?: దినేష్‌ (విజయ్‌ ఆంటోనీ) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుంటాడు. అనాథ అమ్మాయైన ఐశ్వర్య (అరుంధతి నాయర్‌)ని పెళ్లి చేసుకొంటాడు. పది రోజులు కాపురం సవ్యంగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి దినేష్‌కి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. ఓ గొంతు తనని వెంటాడుతుంటుంది. 'జయలక్ష్మిని చంపేయ్‌.. చంపేయ్‌' అంటూ వెంటాడుతుంటుంది. ఆత్మహత్య చేసుకొనేలా ప్రోత్సహిస్తుంటుంది. మానసిక వెద్యుడు దగ్గరకు వెళ్తే.. హిప్నాటిజం వల్ల గత జన్మ జ్ఞాపకాలు తెలుసుకోగలుగుతాడు. గత జన్మలో తన పేరు శర్మ (విజయ్‌ ఆంటోనీ). అతని భార్యే జయలక్ష్మి (అరుంధతి నాయర్‌). తనని వెంటాడుతున్నది కూడా శర్మనే అనే నిజం తెలుస్తుంది. ఆ తరవాత ఏమైంది? గత జన్మ దినేష్‌ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఇంతకీ ఆ జయలక్ష్మి ఈ జన్మలో ఏ రూపంలో ఎదురైంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే 'భేతాళుడు' చూడాల్సిందే.
 
ఎలా ఉందంటే...: మరోసారి విజయ్‌ ఆంటోనీ వైవిధ్యమైన కథనే ఎంచుకొన్నాడు. సూటిగా సుత్తి లేకుండా... తొలి సన్నివేశం నుంచే దర్శకుడు కథలోకి వెళ్లిపోయాడు. ఓ గొంతు దినేష్‌ని వెంటాడడం, ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉత్కంఠని కలిగిస్తాయి. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌లో జయలక్ష్మి ఎవరో తెలుస్తుంది. తొలి భాగమంతా.. జయలక్ష్మి ఎవరో తెలుసుకొనే అన్వేషణే. ద్వితీయార్ధంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలవుతుంది. శర్మకు సంబంధించిన ఎపిసోడ్‌ అది. ఆ భాగం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ జన్మలో దినేష్‌ ఎందుకిలా మారాడు? అతని చుట్టూ ఏం జరిగింది? అనేదీ థ్రిల్లింగ్‌గా సాగే సన్ని వేశాలే. అయితే చిక్కుముడి విడిపోయిన తరవాత శుభం కార్డు వేయడానికి చాలా సమయం తీసుకొన్నాడు దర్శకుడు. ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రాలు చిక్కుముడి విప్పేంత వరకూ చూడ్డానికి బాగుంటాయి. అదేంటో తెలిసిపోయాక ఆసక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు సినిమాని త్వరగా ముగించేయాలి. అలా చేయకుండా సినిమాని సాగదీయడంతో ఆ ఫీల్‌ తగ్గుతూ వస్తుంది.
ఎవరెలా చేశారంటే..: విజయ్‌ మరోసారి చక్కగా నటించాడు. దినేష్‌, శర్మ రెండు పాత్రల్లోనూ పెద్ద వైవిధ్యం కనిపించదు. అయినా బోర్‌ కొట్టకుండా నటించాడు. పతాక సన్నివేశాల్లో మాస్‌ హీరో అవ్వాలన్న ఉద్దేశంతోనేమో తొలిసారి భారీ ఫైట్లు చేశాడు. అరుంధతి నాయర్‌ నటన కూడా ఆకట్టుకొంటుంది. మిగిలినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సాంకేతికంగా చెప్పాలంటే ఈ సినిమా నేపథ్య సంగీతం మరో హీరో. ఆ బాధ్యతనీ విజయ్‌ ఆంటోనీనే సమర్థంగా నిర్వహించాడు. 'జయలక్ష్మీ' అంటూ వచ్చే సిగ్నేచర్‌ వాయిస్‌ ఈ సినిమాలో వినిపించినప్పుడల్లా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కెమేరాపనితనం కూడా ఆకట్టుకొంటుంది. ద్వితీయార్ధంలో, అందునా పతాక సన్ని వేశాలకు ముందు కాస్త ఎడిటర్‌ కత్తెరకు పనిచెప్పుంటే బాగుండేది.
బలాలు 
+ కథ 
+ విజయ్‌ ఆంటోనీ 
+ నేపథ్య సంగీతం
బలహీనతలు 
- వినోదం లేకపోవడం 
- కథనం నెమ్మదించడం 
- ప్రీ క్లైమాక్స్‌
చివరిగా: 'భేతాళుడు' ఓ కొత్త తరహా అనుభవం కోసం. 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com