ప్రవాసీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంతో కలిసిన గల్ఫ్ సినిమా
- December 15, 2016
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల జీవితాల నేపథ్యంలో పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ‘గల్ఫ్’ చిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రవాసీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంతో అనుసంధానం అయ్యింది. కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణా అసోసియేషన్స్ – కోట (విదేశీ తెలంగాణ సంఘాల సంకీర్ణం) మరియు ప్రవాసిమిత్ర మాస పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే (అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విదేశాల్లో ఉంటూ పోటీతత్వం నైపుణ్యం, సామర్ధ్యంతో పాటు మానవతా దృక్పధంతో అందించిన సేవలను గుర్తించి ప్రవాస భారతీయ సంతతికి ప్రవాసీ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2016 బహుకరించి సత్కరించనున్నారు.
గల్ఫ్ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘ గత కొన్నేళ్ళుగా ప్రవాస భారతీయులు ప్రపంచంలోని ఎక్కడెక్కడో కష్టపడుతూ బ్రతుకుతున్నారు. మా సినిమాలో పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ కి వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? దూరపు కొండలు నునుపు అనే సామెతను మరిచిపోయి కన్నవారికి, కట్టుకున్నవాళ్లకి దూరంగా బతకాలనుకునే వారు గల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలతో సినిమాను తెరకెక్కించాం. ముళ్ల మధ్య గులాబీలు అందంగా వికసించినట్టు వ్యథలే కథగా మిగిలినా అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూపిస్తున్నాం. గల్ఫ్‌తోపాటు ఇతర దేశాల్లో జీవిస్తున్న ప్రవాస భారతీయులల్లోని నైపుణ్యానికి అందిస్తున్న పురస్కారాలకు ఇప్పటికే ఎంపిక పూర్తయింది. ఈనెల 18న ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే సందర్భంగా 15దేశాలకు చెందిన 26మందికి అవార్డులు ఇస్తున్నాము. గత 26ఏళ్ళుగా ఈ పురస్కారాల ప్రదానం జరుగుతోంది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.’ అన్నారు.
ప్రవాసమిత్ర మాస పత్రిక సంపాదకులు మంద భీంరెడ్డి మాట్లాడుతూ ‘ ప్రవాసీయులుగా వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లోని నైపుణ్యాలను వెలికి తీసి వారికి అవార్డులు ఇవ్వడానికి ఇది ఒక చక్కని వేదిక. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో సుమారు 20 లక్షలమంది తెలుగు ప్రజలు జీవిస్తున్నారు. అక్కడి ప్రజల బాగోగులను మేము పట్టించుకొని వాళ్ళకు కావలసిన విధంగా సహాయం చేస్తున్నాం. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గల్ఫ్ సినిమా తీస్తున్నా రని తెలిసి వాళ్ళతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చాం. వాళ్ళకు కావలసిని ఇన్‌పుట్స్ ఇచ్చాము. ‘ అన్నారు.
కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణా అసోసియేషన్స్ ట్రస్టీ మిథిలారెడ్డి మాట్లాడుతూ ‘ ఇప్పటికీ చాలామంది గల్ఫ్ అనగానే కేవలం కష్టాలు మాత్రమే ఉంటాయని, అక్కడ అసలు వేరే జీవితం ఉండదనుకుంటారు. అయితే కష్టాలు అందరికీ ఎలా తెలుసో, చాలామందికి తెలియని జీవం వేరే ఉంది. అక్కడ సంతోషాలు, జీవన విధానం అంతా వేరే కూడా ఉన్నాయి. గల్ఫ్ సినిమాలో కష్టాలతోపాటు అక్కడ ఉండే సంతోషాన్ని, ప్రేమను చూపించే ప్రయత్నం చేయడం ఎంతో సంతోషంగా ఉంది.’ అన్నారు.
నిర్మాత యక్కిలి రవీంద్రబాబు మాట్లాడుతూ ‘ శ్రావ్యా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా గల్ఫ్. ఈ సినిమా అనుకున్నప్పటినుండి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి అక్కడి నేటివిటీని జాగ్రత్తగా తెరకెక్కించడానికి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి చాలాసార్లు గల్ఫ్ వెళ్ళి వచ్చారు. అంతేగాక ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను గల్ఫ్‌లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన మా గల్ఫ్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.’ అన్నారు.


తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







