వంగవీటి రివ్యూ..
- December 23, 2016
షూటింగ్ ప్రారంభించినప్పటినుండి సంచలనంగా మారిన వంగవీటి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వర్మ అభిమానులతోపాటు రంగా అభిమానులు కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూశారు. అందరికంటే ముఖ్యంగా విజయవాడ మరియు ఇతర కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల వాళ్లంతా కూడా అంతే ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూశారు. సాధారణంగా వాస్తవ కధల్ని తీసేటప్పుడు ఆయా పాత్రలకి వేరే పేర్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు. రక్త చరిత్ర సినిమాలో కూడా అదే పధ్ధతి ఫాలో అయిన వర్మ , వంగవీటి విషయంలో మాత్రం ఆయా వ్యక్తుల పేర్లు యధాతధంగా ఉంచేశాడు. అందువల్ల ప్రతి ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు బాగా కనెక్ట్ అవుతాడు. ఇది నిజంగా జరిగిన కథ అనిపించటం తో పాటు ఆయా పాత్రధారుల ఒరిజినల్ రూపాలు సినిమా చూస్తున్నంత సేపు మన మదిలో మెదులుతూనే ఉంటాయి. అన్నిటిని మించి ఆయా పాత్రలకి ఎంచుకున్న నటులు తమకిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. రాధా , రంగా ల పాత్ర పోషించిన సందీప్ ని ఎంచుకోవటం వర్మలోని నైపుణ్యం కనపడుతుంది.వెంకటరత్నం పాత్ర పోషించిన నెక్కంటి వంశీ , మురళి పాత్ర పోషించిన వంశీ చాగంటి , గాంధీ పాత్రధారి కౌటిల్య ఆ పాత్రల కోసమే పుట్టారా అన్నంత సహజంగా ఉన్నారు. నూటికి 90 శాతం యథాతథంగానే తెరకెక్కించినా కొన్ని విషయాల్లో మాత్రం వర్మ లౌక్యంగానే వ్యవహరించాడు.అందరి హత్యలకు కారణాల్ని , కారకులని చూపించి, రంగా హత్యకి సూత్రధారులెవరో చెప్పకుండానే సినిమా ముగించాడు.ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం గురించి చెప్పుకోవాలంటే 30 ఏళ్ల కిందటి విజయవాడ ఎలా ఉండేది అనేది యధాతధంగా చూపించారు. కూర్చునే కుర్చీ దగ్గర్నుండి , ఇళ్ళు , కాలేజీలు, సైకిళ్ళు, కార్లు ఇలా ప్రతి ఫ్రెమ్ లోనూ ఎక్కడా ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవకుండా 1980 ల నాటి పరిసరాల్ని ఆవిష్కరించటం మాత్రం అద్భుతంగా ఉంది. వర్మ ఈ సినిమాని ఎంత ప్రేమించి తీసాడో ప్రతి షాట్లోనూ మనకి కనిపిస్తుంది. కమ్మ , కాపు ల మధ్య యుద్ధంగా చెప్పుకునే బెజవాడ గొడవల్ని అసలు కులం అనే మాటే లేకుండా , ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చాకచక్యంగా తెరకేక్కించారు. వర్మ షూటింగ్ సమయం నుండి అనేక వివాదాస్పద పాటల్ని , మాటలని రిలీజ్ చేసినా అది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. అటువంటి కులాలకు సంభందించిన ప్రస్తావనేదీ సినిమాలో లేదు. వాస్తవంగా ఈ సినిమాలో అందరూ హీరోలే , అందరూ విలన్లే. జరిగిన హత్యలు , వాటికి గల కారణాల్ని మాత్రమే సినిమా లో చూపించాడు. ఇందులో ఎవరి తప్పూ కనిపించదు ఎవరి ఒప్పు అనిపించదు.ఆ కథ మొత్తం తెల్సిన వాళ్లకి , ముఖ్యంగా కృష్ణా జిల్లా వాళ్ళకి కనెక్ట్ అయినంతగా ఈ సినిమా మిగతా వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు.
కొసమెరుపు : రంగా ఇంటి పేరుతోనే సినిమా టైటిల్ పెట్టినా , సినిమాలో ఏ పాత్రధారిని కూడా ఇంటి పేరుతొ ప్రస్తావించకపోవడం విశేషం. చలసాని , దేవినేని, ముద్రగడ , అని కాకుండా కేవలం పేర్లతోనే అన్ని పాత్రలను పిలిచారు. చివరకి రంగా , రాధాలని కూడా ఇంటిపేరు తో పిలవకపోవడం విశేషం.
ఒక్క మాటలో : వంగవీటి ఇటీవలి వర్మ చిత్రాల్లో మేటి..
--రాజేష్ వేమూరి(దుబాయ్)
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







