ఉరకలెత్తే ఉత్సాహంతో 2017 లో ముందుకు !!

- December 31, 2016 , by Maagulf
ఉరకలెత్తే ఉత్సాహంతో  2017 లో  ముందుకు !!

ప్రశాంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు… సంతోషంగా గడపాలని ఎవరికి ఉండదు.. అది ఎలా అనేదే అర్థం కాక… వయసుపైబడిన వారే కాదు కుర్రాళ్లూ… రక్తపోటు, మధుమేహానికి గురై.. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో… పెద్దలు ఏం చెప్పినా చిన్నారులు విరుచుకు పడుతున్నారు. యువత పెడదోవ పట్టి బంగారం లాంటి జీవితాల్ని వ్యసనాల పాలు చేసుకుంటున్నారు. మన  ప్రాంతంలోనూ ఎక్కువ మంది మధుమేహానికి, రక్తపోటు వ్యాధులకు గురయ్యారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ రెండు రుగ్మతలతో బాధపడుతున్న వారు ప్రతి ముగ్గురిలో ఒకరున్నారనే విషయం అందోళన పెంచుతోంది. జీవితమంటే ఇదేనా.. అని ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మార్పును కోరుకోవాలే కానీ… మనకు మంచి జరగక మానదు. కొత్త ఏడాది 2017  వస్తోంది. సరికొత్తగా ఆలోచిద్దాం. తీసుకునే నిర్ణయాల పటిష్ట అమలుకు సిద్ధమవుదాం. అందుకు ఒకటో తేదీనే ముహూర్తం చేసుకుందాం. అలజడులకు దూరంగా… మార్పును సాధించి.. ప్రశాంత జీవనం గడుపుతూ అందరి ప్రశంసలూ పొందుదాం… సంతోషంగా సాగుదాం.

  ఒత్తిడి పనిపట్టండి !
-------------------------
ఇప్పుడా… అప్పుడా అని లేకుండా… పనిలో నిమగ్నమైనా.. ఏమాత్రం ఒత్తిడికి గురవుతున్నా.. ఒక్కసారి శ్వాస మీద ధ్యాస పెట్టండి. నాలుగుసార్లు స్వల్పంగా.. ఐదోసారి దీర్ఘంగా శ్వాసను పీల్చి వదులుదాం. అంతే ఒత్తిడి మటుమాయం అవుతుంది. దీన్నో అలవాటుగా చేసుకోండి. ఇదే సమయంలో ప్రతి రోజూ క్రమం తప్పని వ్యాయామానికి అలవాటు పడండి. ఈ రోజు… రేపు అని వాయిదా వేయకుండా ఉదయాన్నే పరుగులు పెడితే.. ఆ రోజంతా చురుకుగా పనులు పూర్తి చేయగల అవకాశం లభిస్తుంది.

 ప్రకృతిలో అడుగులు !
----------------------------
అంతా నాలుగు గోడల మధ్య, లేదంటే గ్లాసులు బిగించిన కార్లలోనే జీవితం సాగిపోతోంది. గతంలో మాదిరి పంట పొలాల్లో పని చేయడం కానీ… అలా నడుచుకుంటూ వూళ్లు దాటడం కానీ లేని రోజులివి. అందుకే వారానికోసారి ప్రకృతిలోకి అడుగు వేయాలి. పచ్చని పరిసరాల మధ్య నడుచుకుంటూ స్వచ్ఛమైన వాతావరణంలో సేదతీరాలి. అప్పుడే మనసు తేలిక పడుతుంది.

 నచ్చిన వస్తువు కొనేద్దాం !
------------------------------
ఎప్పుడూ ఒకే తరహా వస్తువులతో కాలం గడిపేయకండి. మీ మనసుకు నచ్చిన కొత్త వస్తువు కొనుక్కోండి. ఎప్పటి నుంచో మీరు కోరుకుంటున్నవి.. పేరెన్నిక గలవాటిని కొనుక్కొని సంతోషించండి. చిన్న చిన్న బొమ్మల్నో, పుస్తకాల్నో తెచ్చిపెట్టుకోవడం… ఇంటి అలంకరణకు ఉపయోగపడే వస్తువుల్ని కొనుక్కోవడం… ఇలా ఎలాంటిదైనా 2017 కొత్త ఏడాది గుర్తుండిపోయేలా చూద్దాం.

పుస్తకాలను చదవండి !
----------------------------
పుస్తకాలను చదవండి… పరిశోధనాత్మక కథనాలను పరిశీలించండి. మనలో ప్రతికూల ఆలోచనలుంటే పోతాయి. అపోహలు తొలగుతాయి. నిశితంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకునే వీలుంటుంది. అవి మన జీవితానికి మలుపులు అవుతాయి.

మంచి సంగీతంతో సాంత్వన !
---------------------------------
ఏ మాత్రం ఆందోళనగా అనిపించినా.. వాతావరణం ఏమాత్రం గంభీరంగా ఉన్నా.. మీ మనసుకు నచ్చిన సంగీతాన్ని వినండి. మీకు ఇష్టమైన పాటను హమ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల 65 శాతం ఆత్రుత తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా మీకు ఇష్టమైన సంగతులను… జోకులను స్నేహితులతో అలా మాట్లాడి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి.

ఆ మనుషులకు దూరంగా  !
-------------------------------
కొంతమందితో మాట్లాడితే.. మనసు తేలికవుతుంది. మరి కొంతమంది పేరు తలిస్తేనే తలనొప్పి ప్రారంభం అవుతుంది. ఇక వారితో మాటలు కానీ… కలిసి ఉన్నా.. ఇక ఆ ఒత్తిడిని అంచనా వేయడం ఎవరి తరమూ కాదు. అలాంటివారిని వదులుకోకండి. మరీ తప్పదు అనుకుంటే.. వారి ఆలోచనల నుంచి బయట పడండి. అకారణంగా మిమ్మల్ని గురించి నిష్టూరంగా మాట్లాడే వారిని దూరంగా పెట్టండి

పూర్తిగా మానెయ్‌ !
-------------------------
మీకు మందు తాగే అలవాటుందా.. మొదట్లో కొద్దిగా… తర్వాత అలా పెగ్గుల మీద పెగ్గులు వేసుకోవడం అలవాటైపోయిందా… 2017 నుంచి తాగడం నెమ్మదిగా తగ్గించుకోండి. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ప్రారంభించండి. మోతాదు తగ్గింపుపై దృష్టి పెట్టండి. తర్వాత పూర్తిగా మానేయండి.

సెలవుల్లో బయటకు !
-------------------------
ఎప్పుడూ కార్యాలయమేనా… విద్యార్థులైతే పుస్తకాలతో కుస్తీనేనా… వ్యాపారులు, పారిశ్రామికులు లక్ష్యాల సాధనలో అలసిపోవడమేనా… ఆలోచనా సరళికి సెలవు ఇవ్వండి. ఆలోచనల దొంతరల నుంచి బయటపడి.. ప్రశాంతంగా ఉందాం. సెలవులను దొరకపుచ్చుకొని అలా విహారానికి వెళ్లండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేయండి. ఇది చాలు మానసిక ఉల్లాసానికి అంటున్నారు శాస్త్రవేత్తలు.

గుంభనంగా ఉండకండి !
------------------------
మీలో ఎంతటి బాధాకరమైన విషయం ఉన్నా.. అలా గుంభనంగా ఉండకండి. మీలో వేదనను బయటకు చెప్పుకోండి. పశ్చాత్తాపం… బాధను వెళ్లగక్కి.. దుఃఖం నుంచి బయట పడండి. లేదంటే.. మీ మనసు తేలికపడదు.

గంట ముందే నిద్ర !
-----------------------
రాత్రి, పగలూ తేడా లేకుండా మారిన నగరంలో.. కాస్త త్వరగా నిద్రకు ఉపక్రమించండి. ఎప్పుటిలా కాకుండా.. ఓ గంట ముందు నిద్రపోండి. నిద్ర లేమి మన అలసటకు కారణం. గ్రామాల్లో రాత్రి 8 గంటలకే నిద్రపోయి.. వేకువజామునే లేస్తుంటారు. పట్టణాల్లో బారెడు పొద్దెక్కితే కాని నిద్రలేవం. అసలు పడుకునేదే వేకువజామున అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ అలవాట్ల నుంచి బయటపడండి.

ఇవ్వడంలోనే ఆనందం ! 
----------------------------
చిన్నప్పుడు తీసుకోవడంలో ఆనందం ఉంటుంది. పెద్దయ్యాక ఇవ్వడంలో ఆనందాన్ని చూడాలి. అందుకే మనం సంపాదించిన దానిలో కొంత అర్థవంతమైన సామాజిక సేవా సంస్థలకు దానం చేయండి. ఉదాహరణకు అనాథ శరణాలయంలోని పిల్లల బాగు కోరుతూ ఎంతో కొంత దానం చేస్తే.. వారికి మీరు ఉపయోగపడ్డారనే సంతోషం వస్తుంది. ఇలా కొంత సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.

దయాహృదయులుగా  !
---------------------------
ఉద్యోగం.. ఉపాధి… బతుకు దెరువు అనుకొని మనం క్షణం తీరిక లేకుండా సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా గడిపేయడం అలవాటుగా మారిపోతాం. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే.. అయ్యో పడిపోయాడు.. పక్కన వాళ్లున్నారులే సహాయం చేస్తున్నారులే అనుకోకండి. తోటి ప్రయాణికుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు… మనతో ఉన్నవారు అపాయంలో చిక్కినప్పుడు వారికి కాస్త తోడుగా ఉన్నామనుకోండి. వారి చూపుల్లోని కృతజ్ఞతా భావం మనకు మధుర జ్ఞాపకంగా మారుతుంది.

శక్తిని గుర్తించండి  !
-------------------------
ఎప్పుడు నిరాశకు గురైనా.. అలాంటి పరిస్థితులు ఎదురైనా.. మీలో ఉన్న మంచి అంశాలను గుర్తుకు తెచ్చుకోండి. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించండి. అప్పుడు ఉన్న లోపాల నుంచి బయట పడతారు.

మీకు మీ సెలవు  !
-----------------------------
మనం యంత్రాలం కాదు.. అలా పని చేసుకుంటూ.. జీవితాన్ని గడిపేయడానికి. మన మనసుకు ప్రశాంతత కావాలి. మీ యాంత్రిక జీవితానికి విరామం ఇవ్వండి. కొద్ది సమయమైనా విశ్రాంతి తీసుకోండి. అప్పుడే మీలో నూతనోత్సాహం వస్తుంది. తదుపరి కార్యక్రమాలను సులభంగా పూర్తి చేయగలరు !!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com