నేడు తిరుపతికి ప్రధాని మోదీ..

- January 02, 2017 , by Maagulf
నేడు తిరుపతికి ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం తిరుపతికి వస్తున్నారు. ఐదు రోజులపాటు జరగనున్న ఇస్కా సదస్సులను ఆయన ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. విమానంలోనే బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. 10.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.30 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి తిరుపతిలోని వ్యవసాయ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.55 గంటలకు తారకరామా స్టేడియం వద్దకు చేరుకుని.. అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే ప్రదర్శనలను తిలకిస్తారు.

11గంటలకు 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్ సదస్సును ప్రారంభిస్తారు. తొలుత ఇస్కా జనరల్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ డి.నారాయణరావు స్వాగతోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత కేంద్రమంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రసంగం ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సును ఉద్దేశించి 10 నిమిషాలపాటు ప్రసంగిస్తారు.

11.30 గంటలకు ప్లీనరీ సెషన్లను పీఎం ప్రారంభించి, ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలను కూడా సన్మానిస్తారు. ఉత్తమ శాస్త్ర పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలకు ప్రత్యేక బహుమతులను అందజేస్తారు. 11.50 నుంచి 12.24 గంటల వరకు ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా ప్రధానికి నారాయణరావు జ్ఞాపికను అందజేస్తారు. ఎస్వీయూ వీసీ దామోదరం కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ తర్వాత పీఎం మధ్యాహ్నం 12.27 గంటలకు బయల్దేరి గ్రీన్‌ రూమ్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఒంటి గంటకు కారులో బయల్దేరి 1.45 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు.

అక్కడ 10 నిమిషాలు పాటు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1.55కు బయల్దేరి శ్రీవారిని దర్శించుకుంటారు. 2.50 గంటలకు తిరుమల నుంచి కారులో బయల్దేరి 3.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి వెళతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com