శాతకర్ణి రివ్యూ:...

- January 12, 2017 , by Maagulf
శాతకర్ణి రివ్యూ:...

ఆయన సినిమాలు సంక్రాంతికొచ్చాయంటే సందడే సందడి. ఇప్పుడు మరోసారి పండగ సందర్భంగానే బాలయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈసారి వచ్చిన ఈ చిత్రం ప్రత్యేకమైనది. బాలకృష్ణ సినీ ప్రయాణానికి ఓ కీలకమైన మైలురాయిలాంటి వందో చిత్రం. అది కూడా చారిత్రాత్మక కథతో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రాత్మక పాత్రల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ తరహా కథలని నమ్మి సినిమా చేయడంలోనూ తనకి తానే సాటి అయిన బాలయ్య తన వందో చిత్రంగా `గౌతమిపుత్ర శాతకర్ణి` చేయడం విశేషం. తెలుగు జాతి వీరత్వాన్ని చాటి చెప్పిన శకపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్యను.. ఆయన హావభావాల్ని.. పౌరుషంతో చెప్పిన సంభాషణల్ని ప్రచార చిత్రాల్లో చూసినప్పట్నుంచి ప్రేక్షకుల్లో ఆత్రుత.. అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయి. మరి అందుకు తగ్గట్టుగానే బాలయ్య తెరపై విజృంభించాడా? చరిత్ర ఆధారంగా కొద్దిగానే తెలిసిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఎలాంటిది? ఈ చిత్రాన్ని దర్శకుడు ఎలా చిత్రీకరించారన్నది చూస్తే..
కథేంటంటే: ఒకే రాజ్యం... ఒకే యుద్ధం.. అడ్డు గోడలు లేని అఖండ భరత జాతి... అనే కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాలకృష్ణ) . చిన్నప్పుడే తాను కన్న కలని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తుంటాడు. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గంతో పాటు మరెన్నో రాజ్యాలని తన రాజ్యంలో కలుపుకొంటాడు. సౌరాష్ట్రలో నహపాణుడి(కబీర్‌బేడీ) ఆధీనంలో ఉన్న రాజ్యాన్ని కూడా సొంతం చేసుకొని ఉత్తర, దక్షిణాల్ని ఒక్కటి చేయాలనుకొంటాడు. అయితే అప్పటికే శాతకర్ణి పూర్వీకుల్ని ఓడించిన నహపానుడు ధీటుగా జవాబిస్తాడు. నాతో యుద్ధమే చేయాలనుకొంటే నీ బిడ్డ పులోమావిని తీసుకొని రా అంటాడు. నేను ఓడిపోతే నా వీరఖడ్గం నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోతే నీ బిడ్డని నాకిచ్చి వెళ్లిపోవాలంటాడు. అందుకు శాతకర్ణి ఒప్పుకొన్నప్పటికీ, ఆయన భార్య వశిష్టిదేవి (శ్రియ) ఎలా స్పందించింది? తన బిడ్డతో కలిసి యుద్ధానికి వెళ్లిన శాతకర్ణి ఎలాంటి పోరాటం చేశాడు? మొత్తం 33 రాజ్యాల్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొచ్చి శకపురుషుడిగా ఆవిర్భవించిన శాతకర్ణిని దెబ్బ కొట్టేందుకు యుద్ధానికి దిగిన గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? శాతకర్ణిని ఓడించేందుకు అతడుఎలాంటి వ్యూహాల్ని రచించాడు? అందులో గెలుపు ఎవరిది? తిరుగులేని శాతకర్ణికి మాతృమూర్తి గౌతమి (హేమమాలిని) అండగా నిలిచిన వైనం ఎలాంటిది? లాంటి ప్రశ్నలకు సమాధానం వెండితెరపైన చూడాల్సిందే. 
ఎలా ఉందంటే: . మనదైన చరిత్రకి క్రిష్ బృందం కలిసికట్టుగా పెట్టిన ఓ బొట్టు గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ తన వందో చిత్రంగా ఈ సినిమాని ఎంపిక చేసుకొన్నప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలయ్య చారిత్రత్మక చిత్రాల్లో చక్కగా ఒదిగిపోగలరనే ఓ సానుకూలాంశం తప్ప... చరిత్రలో మాస్ అంశాలు ఏముంటాయి? అభిమానుల్ని మెప్పించగలదా? అనే మాటలు వినిపించాయి. కానీ క్రిష్ మాత్రం మన చరిత్రకి మించిన మాస్ అంశం ఏముంటుందని ఈ చిత్రంతో చాటి చెప్పారు. తనకు లభ్యమైన ఆ కొద్దిపాటి చరిత్రనే సినిమాకి అనుగుణంగా చక్కటి కథగా తీర్చిదిద్దుకొన్నారు, అంతే చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. కళ్యాణదుర్గం రాజ్యంపై శాతకర్ణి దండెత్తడం నుంచి సినిమా కథ మొదలవుతుంది. కళ్యాణదుర్గంతో పాటు, నహాపనుడిని ఓడించి మొత్తం 33 రాజ్యాల్ని ఏకఛత్రాధిపత్యంలోకి తీసుకొస్తాడు శాతకర్ణి. ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టి... ప్రతివూరూ ధాన్యాగారం కావాలని, ఆ దిశగా పేదలకి పొలాలు పంచిపెడుతూ పాలన కొనసాగింపుకి పూనుకొంటాడు. అదే సమయంలో అలెగ్జాండర్‌కి అలవికాని భరతఖండాన్ని తాను సొంతం చేసుకోవాలని యుద్ధానికి దిగిన గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ని శాతకర్ణి ఓడించడంతో ఈ కథ పరిసమాప్తమవుతుంది. ఒక పాఠంలాంటి చరిత్రని చక్కటి స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొనేలా తెరకెక్కించారు క్రిష్‌. నహాపనుడిపై యుద్ధం నేపథ్యంలో వచ్చే కుటుంబ సన్నివేశాలతో పాటు, రణక్షేత్రంలో వ్యూహ ప్రతివ్యూహాలు సినిమాలకి కీలకం. ముఖ్యంగా కోటగోడని దాటుకొని వెళ్లే సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. అలాగే తన కొడుకుకి రణక్షేత్రంలో కథ చెబుతూనే, శత్రువుల్ని హెచ్చరించడం... నహాపనుడి చేతిలో బంధీలుగా ఉన్న సామంతరాజుల పిల్లల్ని విడిపించి తీసుకురావడం... రాజసూయయాగంలో తల్లికి అగ్రతాంబూలం ఇచ్చి సింహాసనంపై కూర్చోబెట్టే సన్నివేశాలు అలరించేలా ఉంటాయి. యుద్ధానికి తన బిడ్డ పులోమావిని తీసుకెళ్లాలని శాతకర్ణి నిర్ణయించుకొన్న విషయం ఆయన భార్య వశిష్టిదేవికి ఓ పాట రూపంలో తెలిసేలా చేసే సన్నివేశాలు, ఆ తర్వాత పండిన భావోద్వేగాలు దర్శకుడి పనితనానికి అద్దం పడతాయి. తెలుగు జాతి, తెలుగు చరిత్ర, తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమిది. సినిమా చూస్తున్నంతసేపూ బాలకృష్ణ కోసమే పుట్టిన కథ ఇది... ఆయన మాత్రమే చేయగలరేమో అనే భావన మనసులో కలుగుతుంటుంది. సంభాషణలు కూడా తనకు మాత్రమే సాధ్యమయ్యేలా పలికారాయన.
ఎవరెలా చేశారంటే: .. నటన పరంగా ఇందులో బాలకృష్ణ విశ్వరూపం కనిపిస్తుంది. భావోద్వేగాలు పలికించడంతో పాటు, యుద్ధ సన్నివేశాల్లోనూ చురుగ్గా కదులుతూ సన్నివేశాల్ని రక్తి కట్టించారు. ఆయన సంభాషణల్ని పలికిన విధానం ఆకట్టుకునేలా ఉంది. హేమమాలిని, శ్రియ నటన చాలా బాగుంది. శాతకర్ణి మాతృమూర్తి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రియ నటన కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తుంది. వశిష్టిదేవిగా పాత్రలో లీనమైన విధానం ఆమెలో ఎంత మంచి నటి ఉందో చెప్పకనే చెబుతుంది. మిగతా నటీనటులంతా కూడా వాళ్ల వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. శివరాజ్‌కుమార్ ఓ పాటలో మెరుస్తారు. సాంకేతికంగా ఈ సినిమాకి వందకి వంద మార్కులు వేయాల్సిందే. సుదీర్ఘంగా, భారీ తారాగణం నేపథ్యంలో సాగే పోరాట ఘట్టాలున్నప్పటికీ దర్శకుడు ఎంతో సహజంగా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. నిజంగా జరుగుతున్న రణ రంగానికి మనం సాక్షులుగా ఉన్నామా అనిపిస్తుంటుంది. కొన్నిచోట్ల శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరాయి. సాయిమాధవ్‌ బుర్రా కలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణల బలం ప్రస్ఫుటంగా కన్పిస్తూనే ఉంటుంది. యుద్ధ సన్నివేశాలకి ధీటుగా... ప్రతి మాటా ఓ తూటాలా పేలిపోతుంటుంది. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం, సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు... ఇలా వేటికమే సాటి అన్పిస్తాయి. ఇంతటి భారీదనంతో కూడిన చిత్రాన్ని 79 రోజుల్లో తీశారంటే చిత్రబృందాన్ని మెచ్చుకోవల్సిందే.
బలాలు 
+ కథ, కథనం 
+ బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని నటన 
+ క్రిష్‌ దర్శకత్వం 
+ సాయిమాధవ్‌ సంభాషణలు
చివరగా: ఆకట్టుకోవడమే కాదు.. అనుభూతిని మిగిల్చే'శాతకర్ణి' 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com