క్షమాపణ

- September 17, 2015 , by Maagulf

సర్వేంద్రియాలను పంచుకొని .. శరీర 

భాగాల్ని చీల్చుకొని మొలకెత్తిన మొలకలకు 
నీ ఉగ్గు పాలతో బ్రతుకు రుచుల్ని చూపి, 
అండగా బ్రతుకుపై  ఆశనిచ్చిన నిన్ను... 

రెక్కలొచ్చిన  పక్షులు కూటికోసం,గూటికోసం 
శ్రమను నమ్మకుండా తేరగా వచ్చే..శాశ్వతం 
కా..లేని నీఆస్తులకోసం వేదిస్తున్నప్పుడు .. 

ఆలుమగలు,తోబుట్టువులు,కన్న బంధాలు
అనుబంధాలుగా అల్లుకుంటూ వచ్చిన నీ పొదరిల్లు 

ముక్కలు చెక్కలు కాకుండా ఆపాలనే తపనతో 
నీలో నీవే ముక్కలై ,రోజులు వారాలు నెలలుగా 
నిన్ను నువ్వు పంచుకోబడి.. 
బ్రతికుండగానే అస్తిత్వం కోల్పోయి 
స్థాన గమనం చెందుతూ నిన్ను నువ్వు వారికీ,

వారిదనుకునే (స్వంత)సంతానానికి 
బానిసగా చాకిరి చేసే నరాలుగా,
ప్రాణం లేని ఎముకగా.. మార్చబడినప్పుడు 

తల్లి వేరువన్న కనికరం లేని  వెక్కిరింపు,ద్వేష దేహాల 
చెదలు  మనుషుల మధ్య.., 

వారు నడుస్తున్న తోవలో ఆ విష సంస్కృతి,దావానంలా 
వ్యాపిస్తుంటే.....

నీవు కూరుకుపోయిన బురదలోకే,నీ సంతతి భవితవ్యం
జారిపోతుందేమోనన్న కన్నతీపితో, నీలో నీవు కుమిలి పోతూ.

ఉడిగి పోయిన శరీరానికి ఆహారం కరువై,
ఆకలి మంటలనార్పదొరికిన పాచి పదార్థాల్ని నోట్లోకి తోస్తూ .. 
రాని మృత్యువు కోసం చేతులు చాచి ఆరాట పడుతూ..
నొప్పో,బాదో,రోగమో తెలియని తనంలో 

నీలోకి నీవు మళ్లీ అసంకల్పిత గర్భంలోంచి బయల్పడ్డ 
అనాధ శిసువులా,ముడుచుకు పడుకున్న..
ఓ ముదుసలి ప్రాణమా,,తోటి మనుషులుగా 
జన్మించిన మా పాపానికి....

నీకివే మా వేల వేల క్షమాపణలు..
   

(14.08.2013.న కవిసంగమంలో మళ్లీ కొద్ది మార్పులు చేసి,,కన్న తల్లిదండ్రుల సంతోషమే మనిషి సాధించిన మొదటి స్వాతంత్ర్యం కావాలి ) 


--జయ రెడ్డి బోడ (అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com