శ్రీలంక నేవీ భారత జాలర్లపై కాల్పులు

- March 06, 2017 , by Maagulf
శ్రీలంక నేవీ భారత జాలర్లపై కాల్పులు

సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లపై శ్రీలంక నేవీ దళాలు కాల్పులు జరపడంతో ఓ భారతీయ జాలరి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి కచ్చతీవులు సమీపంలోని పాల్క్ స్ట్రెయిట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల బాధితుడి మృతదేహాన్ని రామేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమవారం పెద్దసంఖ్యలో రామేశ్వరం నుంచి జాలర్లు చేపలు పట్టేందుకు బయల్దేరి వెళ్లారు. కచ్చతీవులు సమీపంలో పడుతుండగా శ్రీలంక దళాలు అక్కడికి చేరుకుని ఒక్కసారిగా కాల్పులు జరపడం ప్రారంభించాయి. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా ఇవ్వకుండా కాల్పులకు దిగినట్టు మత్స్యకారులు వాపోయారు. కాల్పులు జరిగిన సమయంలో మొత్తం 2000 మంది జాలర్లు చేపల వేటలో ఉన్నట్టు సమాచారం.
మరోవైపు రాత్రి 10 గంటలకు సముద్రంలో కాల్పులు జరిగినట్టు రామేశ్వరానికి సమాచారం రావడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ''శ్రీలంక ఆర్మీ జరిపిన కాల్పుల్లో తంగచిమదంకు చెందిన బ్రిత్సో (22) అనే మత్స్యకారుడు చనిపోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. రాత్రి 12:30 గంటలకు అంతా ఒడ్డుకు చేరుకున్నారు'' అని రామేశ్వరం మత్స్యకారుల నాయకుడు ఎమిరిట్ పేర్కొన్నారు.

కాగా శ్రీలంక దళాలు తమిళనాడు ప్రజలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొంటూ ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖరాశాలు. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే 32 మంది జాలర్లను నిర్భంధంలోకి తీసుకున్నాయనీ.. ప్రస్తుతం 128 బోట్లతో పాటు మొత్తం 85 మంది తమిళనాడు జాలరులు, శ్రీలంక ఆధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. శ్రీలంక వ్యవహారంపై కేంద్రం చొరవతీసుకుని మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com