శంషాబాద్‌కు బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌ అవార్డు

- March 06, 2017 , by Maagulf
శంషాబాద్‌కు బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌ అవార్డు

హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. అవార్డులను కొల్లగొట్టడంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న శంషాబాద్‌ మరోసారి సత్తా చాటింది. 2016-17 సంవత్సరానికి గాను 5 నుంచి 15 మిలియన్‌ ప్రయాణికుల చేరవేత విభాగంలో... ఆసియాలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌ అవార్డును సొంతం చేసుకుంది.

దాదాపు 5 వేల 5 వందల ఎకరాల విస్తీర్ణంలోని శంషాబాద్‌.. ఆసియాలోనే తొలి గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా రూపుదిద్దుకుంది. ఒకవైపు పర్యావరణానికి పెద్ద పీట వేస్తూనే మరోవైపు నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత దేశంలోనే అతి పెద్ద రన్‌వే కలిగిన విమానాశ్రయంగా శంషాబాద్‌ గుర్తింపు పొందింది. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆసియాలోనే బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌గా అవతరించింది.

తొమ్మిదేళ్ల ప్రస్థానంలో వివిధ క్యాటగిరీల్లో వరుసగా 40కి పైగా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న శంషాబాద్‌.. నిర్ణీత సమయంలోనే 12 మిలియన్‌ ప్యాసింజర్స్‌ చేరవేత లక్ష్యాన్ని అధిగమించి రికార్డు సృష్టించింది. ప్రయాణికుల భద్రత విషయంలో చేపట్టిన పటిష్టమైన చర్యలకు గాను ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే బ్రిటన్‌ నుంచి సేఫ్టీ కౌన్సిల్‌ పురస్కారాన్ని పొందింది. ఎయిర్‌పోర్టులోనే సోలార్‌ విద్యుత్‌ ప్లాంటును నెలకొల్పిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్‌ రికార్డు సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com