అధికార పార్టీలకు ఐదు రాష్ట్రాల్లోనూ ఎదురు గాలి
- March 11, 2017
ఐదు రాష్ట్రాలు. ఒక్కటే ఒరవడి. పనిచేయని వాళ్లను ఇంటికి పంపిస్తామని ప్రజలు విస్పష్టంగా తీర్పుచెప్పారు. యూపీ నుంచి గోవా వరకూ, మణిపూర్ నుంచి పంజాబ్ దాకా అదే విధమైన తీర్పు. గోవా, ఉత్తరాఖండ్ లో సాక్షాత్తూ ముఖ్యమంత్రులను కూడా ప్రజలు ఓడించారు. ఢిల్లీ బయట జెండా పాతాలని ఆశపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఎన్నికల ఫలితాల్లో మరో విశేషం. అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలను ప్రజలు చాప చుట్టేశారు. అయితే బీజేపీ, లేదా కాంగ్రెస్ కు జైకొట్టారు. యూపీలోనూ బలమైన ప్రాంతీయ పార్టీల హవాకు తెరపడింది. యూపీలో బీజేపీ వనవాసం ముగిసింది. 16 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 300కు పైగా సీట్లను సాధించే దిశగా దూసుకుపోతోంది. దత్తపుత్రుడు నరేంద్ర మోడీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఆశలు పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి జలక్ ఇచ్చారు. బీఎస్పీ ఏనుగు కుప్పకూలింది. రాష్ట్ర వ్యాప్తంగా 2014 తరహాలోనే మోడీ మ్యాజిక్ పనిచేసింది. బుందేల్ ఖండ్ ప్రాంతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. యాదవ్ కుటుంబంలో ముసలం సమాజ్ వాదీ పార్టీని దెబ్బ తీసింది. ములాయం చిన్నకోడలు అపర్ణా యాదవ్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలో చేరిన రీటా బహుగుణ జోషి విజయం సాధించారు. పంజాబ్ లో బాదల్ కుటుంబ పాలనపై వెల్లువెత్తిన వ్యతిరేకత కాంగ్రెస్ కు లాభించింది. హస్తం పార్టీ మూడింత రెండు వంతుల మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. పంజాబ్ లో ఊడ్చేద్దామని ఉవ్విళ్లూరిన ఆమ్ ఆద్మీ పార్టీ కలలు కల్లలయ్యాయి. ఉత్తరాఖండ్ లో బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. మోడీ సునామీలో కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూబోతోంది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ ముందు జాగ్రత్త పనిచేయలేదు. పోటీ చేసిన రెండు చోట్లా అయన్ని ప్రజలు ఓడించారు. గోవాలో మాత్రం బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మనోహర్ పారికర్ కేంద్ర మంత్రిగా వెళ్లడం బీజేపీకి మైనస్ పాయింట్ గా మారిందని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈశాన్య రాష్ట్ర మణిపూర్ లో బీజేపీ సంచలన విజయాలను సాధిస్త్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఆధిక్యంలో కొనసాగుతోంది. సీఎం ఇబోబి సింగ్ పై పోటీ చేసిన ఉక్కు మహిళ ఇరోం షర్మిల ఓటమి పాలయ్యారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







