బంగారం దిగుమతి భారీగా తగ్గిపోయింది

- March 12, 2017 , by Maagulf
బంగారం దిగుమతి భారీగా తగ్గిపోయింది

పెద్దనోట్లను రద్దు చేస్తూ గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అనేక రంగాలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం బంగారంపైనా పడింది. నవంబర్‌ 8 తర్వాత బంగారానికి డిమాండ్‌ తగ్గడంతో పాటు డిసెంబర్‌-జనవరి మధ్యకాలంలో దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. నవంబర్‌ నెలలో 119.2 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతి.. డిసెంబర్‌ నెలలో 54.1 టన్నులకు పడిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలోనూ మరింత తగ్గి 53.2 టన్నులకు పరిమితమైంది. గతేడాది జనవరితో పోలిస్తే 43 శాతం పసిడి దిగుమతులు పడిపోయాయి. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో భారీగా నోట్ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. పెద్దనోట్ల రద్దు తర్వాత పాత నోట్లను వదిలించుకునేందుకు ప్రజలు భారీగా బంగారం కొనుగోలుకు మొగ్గు చూపారు. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో దిగుమతులు పెరిగాయి. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో డిసెంబర్‌, జనవరి నెలల్లో దిగుమతుల్లో భారీ క్షీణత నమోదైందని తెలిపింది.

దేశంలో 80శాతం మంది బంగారు ఆభరణాలను నగదు ద్వారానే కొనుగోలు చేస్తారు. నవంబర్‌ 8 తర్వాత అలా కొనుగోలు చేసే వారి సంఖ్యా క్రమంగా పడిపోయింది. బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో 892.2 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, ప్రస్తుతం ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో అది 546 టన్నులకు పరిమితమైంది.

ఇక 2015-16 సంవత్సరంలో అత్యధికంగా 986 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com