దక్షిణాదిలో మణిరత్నంగారి తర్వాత పూరి జగన్నాథే!

- March 13, 2017 , by Maagulf
దక్షిణాదిలో మణిరత్నంగారి తర్వాత పూరి జగన్నాథే!

‘‘నా తొలి సినిమా ‘బద్రి’ చేస్తున్నప్పుడు నేనెలా దర్శకత్వం చేస్తానో అనే ఓ ఉత్కంఠ మా నిర్మాత త్రివిక్రమరావులో ఉండేది. తొలి రోజు సెట్‌లో నా పనితీరుని చూస్తూ కూర్చున్నారు. ఆ రోజు ప్యాకప్‌ చెప్పగానే నా దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ‘నువ్వు యాభై సినిమాలు చేస్తావు’ అన్నారు. ఇప్పటికే 33 సినిమాలు చేశా. నా నిర్మాత అప్పుడు నన్నెలా నమ్మారో, అదే నమ్మకంతో చెబుతున్నా. ఇషాన్‌ కూడా 50 సినిమాలు చేస్తాడు’’ అన్నారు పూరి జగన్నాథ్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రోగ్‌’. ఇషాన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. మన్నారా చోప్రా, ఏంజెలా కథానాయికలు. సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సునీల్‌ కశ్యప్‌ స్వరకర్త. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని బాలీవుడ్‌ నటుడు అర్భాజ్‌ ఖాన్‌ ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ స్వీకరించారు.

ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ ‘‘సరదాగా సాగే ఓ ప్రేమకథ ఇది. ఈ సినిమాలో ఉన్నన్ని మెలోడీలు ఈమధ్య కాలంలో ఏ సినిమాలో వినలేదు. సునీల్‌ కశ్యప్‌ స్వరపరిచిన పాటలు సినిమాకి బలాన్నిస్తాయి. ఇషాన్‌ చాలా బాగా చేశాడు.

అతడికి మనోహర్‌లాంటి అన్నయ్య ఉండటం అదృష్టం. ఎన్ని సినిమాలు చేస్తారో చేయండి, ఇషాన్‌ని మాత్రం స్టార్‌గా నిలబెట్టండి అని చెబుతుంటారు మనోహర్‌. ఇషాన్‌కి మంచి భవిష్యత్తు ఉంది. 20 యేళ్లపాటు నిలదొక్కుకొని కష్టపడగలిగే సత్తా ఉంది’’ అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘‘ఇషాన్‌ చాలా బాగున్నాడు. అగ్ర కథానాయకుడిగా ఎదగాలి. ప్రచార చిత్రం చూస్తుంటే సినిమాని ఓ కొత్త కుర్రాడు తెరకెక్కించినట్టుగా ఉంది. పూరి జగన్నాథ్‌ వయసు తగ్గుతూ ఉంటుంది తప్ప పెరగదు.

కథ, సంభాషణలు సమకూర్చుకొని ప్రతిసారీ కొత్తగా సినిమాని తీయగల సత్తా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్‌. దక్షిణాదిలో మణిరత్నంగారి తర్వాత పూరినే. నిజమైన క్రియేటర్లు వాళ్లు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి.

మళ్లీ పూరి తనయుడు ఆకాష్‌ కథానాయకుడిగా పరిచయమయ్యే సినిమా వేడుకలో ఇలా అందరం కలవాలి’’ అన్నారు. అర్భాజ్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘మనోహర్‌ ఎంతో పట్టుదలతో తన తమ్ముడిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. వాళ్లిద్దరినీ చూస్తున్నప్పుడు సల్మాన్‌ఖాన్‌, నేను... ఇలా మా కుటుంబం గుర్తుకొస్తుంటుంది.

పూరి ఎంతోమంది నటుల్ని పరిచయం చేశారు. ఈ చిత్రంతో ఇషాన్‌ ఓ స్టార్‌గా ఎదుగుతాడు’’ అన్నారు. ఇషాన్‌ మాట్లాడుతూ ‘‘పూరి జగన్నాథ్‌ దంపతులు నన్ను పెద్ద కొడుకులా చూసుకొన్నారు. పూరి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి నాతో నటింపజేశారు.

తొలి సినిమాలాగా కాకుండా, అనుభవమున్న కథానాయకుడిలా నటించావు అని అంతా చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. సత్యానంద్‌గారి శిక్షణతోనే అలా నటించా’’ అన్నారు. నిర్మాతలో ఒకరైన సి.ఆర్‌.మనోహర్‌ మాట్లాడుతూ ‘‘పూరి జగన్నాథ్‌గారిని నాకు రక్షిత పరిచయం చేశారు. ఇషాన్‌ని చూసి చాలా బాగున్నాడని ఆయన తన చేతుల మీదుగా పరిచయం చేశారు.

ఇషాన్‌తో మరిన్ని సినిమాలు చేస్తానని మాట ఇచ్చారు. అన్ని హంగులున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘పూరి జగన్నాథ్‌ సార్‌తో మరోసారి పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది.

మంచి పాటలు సమకూరాయి’’ అన్నారు సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌. ఈ కార్యక్రమంలో అలీ, ఛార్మి, ప్రసాద్‌ వి.పొట్లూరి, వి.ఆనంద్‌ప్రసాద్‌, భాస్కరభట్ల, సంజన, అభిషేక్‌ అగర్వాల్‌, అనూప్‌సింగ్‌, జునైద్‌, ముఖేష్‌, వెంకట్‌, సత్యానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com