శ్రీహరికోటలో షార్ భద్రతకు డ్రోన్ కెమెరాలు
- May 19, 2017
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ భద్రతకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భద్రతాధికారులు నిర్ణయించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గురువారం షార్ భద్రతపై తమిళనాడు, ఆంధ్ర పోలీసు,నిఘా అధికారులు, కోస్ట్‌గార్డు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల అధిపతులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. గతంలో భద్రతపై సమన్వయ సమావేశం జరిగిన తర్వాత నుంచి నేటి వరకు తొమ్మిది రాకెట్ ప్రయోగాలు జరిగాయని, ఇందులో భద్రతపరంగా అన్నీ ఏర్పాట్లు చేశారని, షార్ భద్రతకు ఇబ్బందేమీ లేదని షార్ నియంత్రణాధికారి జేవీ రాజారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే పద్ధతిని కొనసాగించాలని చెప్పినట్లు సమాచారం. ఇంటిలిజెన్సీ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఐజీ జె.సత్యనారాయణ షార్‌లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దాంతోపాటు స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దేశంలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, ఉగ్రవాదుల కదలికలు ఎక్కడ ఉంటాయో చెప్పలేని స్థితిలో ఉన్నామని, దీనిని దృష్టిలో ఉంచుకుని షార్ భద్రత పరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల తనిఖీలు క్షుణ్నంగా జరగాలని, సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం.
జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ షార్కు తరచూ పిచ్చోళ్లు వస్తున్నారని, వారిని సీఐఎస్ఎఫ్ వారు పట్టుకుని తమకు అప్పగిస్తున్నారని, వారిని పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత వదిలిపెడుతున్నట్లు వివరించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఎస్పీ శిబి చక్రవర్తి రాకెట్ ప్రయోగాల సమయంలో తీరప్రాంతంలో గట్టి నిఘా చర్యలు తీసుకుంటున్నామని, పెట్రోలింగ్‌తోపాటు, సముద్రంలో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. పాత నేరస్థుల సమాచారం ఉంటే బాగుంటుందని, ఏదైనా జరిగితే వారి గురించి ఆరా తీస్తే.. నిందితులు సులువుగా దొరికే వీలుందని షార్ భద్రతాధికారి సెంథిల్‌కుమార్ చెప్పినట్లు సమాచారం.
దీనిపై గూడూరు డీఎస్పీ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ పాత నేరస్థుల వివరాలు జాతీయ నేర విభాగం నుంచి తీసుకోవాల్సి ఉంటుందని సూచించినట్లు తెలిసింది. దీనిపై రాష్ట్ర ఇంటిలిజెన్సీ ఇన్ఛార్జి్జ డీఎస్పీ శ్రీనివాసులు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అసలు కేసులు పెట్టకుండా.. నమోదు చేయకుండా..
నిందితులను అరెస్టు చేయకుండా వివరాలు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారని తెలిసింది. ఇంకా పలువురు షార్‌లోని లేబర్ కాలనీల్లో, పక్కనే ఉన్న నవాబుపేట, తదితర ప్రాంతాల్లో వందలాది మంది ఉంటున్నారని, వారి గురించి పూర్తి సమాచారం ఉండటం లేదని, దాంతో ఏదైనా జరిగినపుడు వివరాలు తెలుసుకోలేక పోతున్నామని సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలో గుత్తేదార్లు కూడ సహకరించడం లేదని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరి ఆధార్, బయోమెట్రిక్ విధిగా తీసుకోవాలని ఐఎస్‌డబ్ల్యూ డీఐజీ సూచించినట్లు తెలిసింది.
కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల సీనియర్ కమాండెంట్ సుభాష్ సిన్హా, షార్ నియంత్రణాధికారి జేవీ రాజారెడ్డి, తదితరులు శ్రీహరికోట మెరైన్ పోలీసుల సేవలు బాగా ఉన్నాయని, వారు ప్రతి విషయంలో సహకరిస్తున్నట్లు, తుపాను సమయంలో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశంలో కోస్ట్గాంü్డ కమాండెంట్ లోషన్, కేంద్ర నిఘా డీఎస్పీ అవినాష్, ఎస్బీ డీఎస్పీ కోటిరెడ్డి, మైరెన్ సీఐ సురేష్‌కుమార్, కౌంట్ ఇంటిలిజెన్సీ సీఐ మల్లికార్జున్, షార్ డిప్యూటీ హెడ్ సెక్యూరిటీ సిస్టమ్ లీలా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







