ఆంధ్ర ప్రదేశ్ కి భారీ సాయం: అమిత్ షా

- May 25, 2017 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ కి భారీ సాయం: అమిత్ షా

విజయవాడ: విజయవాడ విజయాలకు నిలయం. విజయవాడ నుంచి భాజపా విజయ ప్రస్థానం మొదలవుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. విజయవాడ సిద్దార్థ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల మహా సమ్మేళనంలో అమిత్షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఈ సమావేశం భాజపాకు పాశుపతాస్త్రం. ఇంద్రకీలాద్రిని చీల్చి కృష్ణానదికి అర్జునుడు దారి చూపారు. అలాగే ఇక్కడి కార్యకర్తలు విజయానికి కృషి చేస్తారని భావిస్తున్నా. ఏపీలో 25వేల బూత్ కమిటీలు నియమించుకోవడం సంతోషం. 12 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. 13 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. మరో నాలుగు రాష్ట్రాల్లో భాగస్వామ్యంతో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర సాయంపై ప్రశ్నించే వారు చెవులు రిక్కించి వినాలి. రాష్ట్రానికి ఎన్నో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇచ్చారు. పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే భరిస్తోంది. లక్షా 75వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆర్థిక సాయం అందించింది. కాంగ్రెస్ నేతలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. 60 ఏళ్ల తరబడి జరగని వృద్ధి ఈ మూడేళ్లలో చేసి చూపాం’’ అని అమిత్ షా వివరించారు. జులైలో ప్రధాని మోదీ విశాఖ రానున్నారు. పండుగ వాతావరణంలో అందరూ ఆయనకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపాలని కోరారు.
అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘‘మోదీ అంటే సుపరిపాలనకు మారు పేరు. మరో పదేళ్లపాటు భాజపా దేశ వ్యాప్తంగా అధికార ఢంకా మోగించాలి. దేశం మొత్తం భాజపా, మోదీవైపే చూస్తోంది. గడచిన మూడేళ్లలో ఒక్క అవినీతి కుంభకోణం లేదు. ఇతర పార్టీలు చీలిక పేలికలుగా తయారయ్యాయి. అవినీతి పరుల పాలిట మోదీ అతివీర భయంకరునిగా తయారయ్యారు. మోదీ వంటి సామాన్యుడు ప్రధాని పదవి చేపట్టారంటే అది భాజపా ఘనతే. రేపటి నుంచి జూన్ 15 వరకు మోదీ ఫెస్ట్ పేరుతో ఉత్సవాలు జరగబోతున్నాయి. పార్టీ శ్రేణులంతా పాల్గొని భాజపాను ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఆదుకుంటోంది. కొందరు వ్యక్తులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. వాటిని తిప్పికొట్టాలి’’ అని కార్యర్తలకు సూచించారు.
కేంద్రమంత్రి సురేష్ ప్రభు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ నేతలు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, విష్ణుకుమార్రాజు, మాధవన్, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భాజపా శ్రేణులు సమ్మేళనంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com