ఉగ్రవాదంపై ఐక్య పోరాటం నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు

- June 08, 2017 , by Maagulf
ఉగ్రవాదంపై ఐక్య పోరాటం నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు

కజకిస్తాన్‌ రాజధాని అస్తానాలో శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచానికి పెనుసవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు. వివిధ దేశాల్లో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాటానికి పటిష్టమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించనున్నారు. ఎంతో కాలంగా భారత్, పాకిస్తాన్‌లు ఎదురుచూస్తున్న ఎస్‌సీఓ శాశ్వత సభ్యత్వానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. 2001లో ఎస్‌సీఓ ఏర్పడిన తరువాత తొలిసారిగా విస్తరిస్తుండటం విశేషం.
చైనా, రష్యా తదితర ప్రధాన మధ్య ఆసియా దేశాధినేతలు పాల్గొంటున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ గురువారం అస్తానా చేరుకున్నారు. ఆయన రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తారు. ఆర్థిక, అనుసంధాన అంశాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారంపై ముందడుగు వేసేందుకు ఎస్‌సీఓ సమావేశం కీలకం కానుందని అస్తానా బయలుదేరేముందు మోదీ పేర్కొన్నారు. చైనా ఆధిపత్యం సాగుతున్న ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, వాణిజ్య లావాదేవీల్లో భారత్‌కు మైలురాయిగా నిలుస్తుంది. భారత్, పాక్‌ల సభ్యత్వం... ఈ ప్రాంతాల్లో సవాళ్లను అధిగమించడానికి, వాణిజ్య, పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదపడుతుందని ఎస్‌సీఓ సెక్రటరీ జనరల్‌ రషీద్‌ అలిమోవ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com