అమెరికా, బ్రిటన్, జపాన్ లో చిన్నారుల దైన్యం: సంపన్న దేశాల్లో ఇదే స్థితి

- June 15, 2017 , by Maagulf
అమెరికా, బ్రిటన్, జపాన్ లో చిన్నారుల దైన్యం: సంపన్న దేశాల్లో ఇదే స్థితి

అమెరికా, బ్రిటన్, జపాన్ తదితర దేశాలు.. పేరుకు సంపన్న దేశాలే.. కానీ అక్కడ కూడా దారిద్య్రం తాండవిస్తున్నది. 41 సంపన్న దేశాల్లో బ్రిటన్, అమెరికాల్లో ప్రతి ఐదుగురిలో ఒక చిన్నారి జీవనం దారిద్య్ర రేఖకు దిగువనే కొనసాగుతున్నదని యూనిసెఫ్ నిర్వహించిన సర్వేలో తేలింది.
అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో బాలలు, యువత పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయని తేలిందని యూనిసెఫ్ డైరెక్టర్ సారా కుక్ పేర్కొన్నారు. పిల్లలు ఆకలితో అలమటించటంతోపాటు తీవ్రంగా అణచివేతకు గురవుతున్న సంపన్న దేశాల్లో బ్రిటన్ మొదటి స్థానంలో ఉన్నది. బ్రిటన్ బాలల్లో ముగ్గురికి ఒకరు బహుళ కోణాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌లలో 20 శాతం మంది బాలలకు సురక్షితమైన పౌష్టిక ఆహారం లభించడం లేదు. ఆకలి తీర్చడంలో గానీ, పేదరిక నిర్మూలనలో గానీ, పిల్లలకు విద్యావైద్య వసతులు కల్పించడంలో అమెరికన్లలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి.
41 సంపన్న దేశాల్లో సుమారు 13 శాతం మంది బాలలకు సరిపడా సురక్షిత పౌష్టికాహారం అందుబాటులో లేదు. విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం తదితర అంశాల్లో జర్మనీ, నొర్డిక్ (ఉత్తర యూరప్, ఉత్తర అట్లాంటిక్) దేశాలు తొలి స్థానాల్లో నిలిస్తే రొమేనియా, బల్గేరియా, చిలీ చిట్ట చివరి స్థానాలకు పడిపోయాయి. ఇక న్యూజిలాండ్ 34వ ర్యాంక్, అమెరికా 37వ ర్యాంక్ వద్ద నిలిచిపోయాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే న్యూజిలాండ్‌లో 15 - 19 ఏండ్ల మధ్య వయస్కుల ఆత్మహత్యలు సగటున మూడు రెట్లు ఎక్కువ. తాము సర్వే నిర్వహించిన అత్యధిక దేశాల్లో పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతినడంతోపాటు ఊబకాయులుగా మారుతున్న యువత సంఖ్య పెరుగుతున్నదని యూనిసెఫ్ తెలిపింది.
ఆదాయాలు పెరిగినా.. మెరుగు పడని బాలల స్థితి 
వసతుల కల్పనపై కుటుంబాల అశ్రద్ధ
ఆయా కుటుంబాల సభ్యులు సంపాదిస్తున్న అధిక ఆదాయాలు స్వత:సిద్ధంగా వారి పిల్లల పరిస్థితి మెరుగు పడేందుకు దోహద పడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వివిధ అంశాలలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అసమానతల తొలగింపునకు వివిధ దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సారా కుక్ స్పష్టం చేశారు. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించడంపై శ్రద్ధ వహించకపోగా మానసిక రోగులుగా మారుతున్నారని, వారికి ఆర్థిక వసతులను కల్పించడంలో తల్లిదండ్రులు వెనుకబడుతున్నారని యూనిసెఫ్ నివేదిక పేర్కొంటున్నది. మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని తేలిన జపాన్, ఫిన్లాండ్ దేశాల్లోనూ 15 ఏళ్లలోపు బాలల్లో 20 శాతం మందికి కనీస విద్యా వసతులు లేవని ఆందోళన వ్యక్తం చేసింది. పేదలు, సంపన్నుల మధ్య అంతరాయం పెరిగిపోతున్నదని యూనిసెఫ్ హెచ్చరించింది.
పేదరిక నిర్మూలన లక్ష్యాల్లో వెనుకబడ్డ సంపన్నదేశాలు 
బ్రిటన్ లో ఆహారం పట్ల అభ్రదత.. ఆకాంక్షల అణచివేత
అంతర్జాతీయంగా బాలల దారిద్ర్య నిర్మూలన, ఆకలి లేకుండా చేయడం, ఆరోగ్యానికి ప్రోత్సాహం, నాణ్యమైన విద్యాబోధన, అసమానతల తగ్గింపు తదితర అంశాల్లో నిర్దేశించుకున్న లక్షాల సాధనలో సంపన్న దేశాలు వెనుకబడి ఉన్నాయని ఈ నివేదిక చెప్తున్నది. బ్రిటన్ బాలల్లో ఆహారం పట్ల అభద్రత వెంటాడుతున్నది. కుటుంబాలు తమ పిల్లలకు సరిపడా భోజన వసతి కల్పించడంలో వెనకబడుతున్నాయని యూనిసెఫ్ పేర్కొన్నది. ఆదాయాల్లో అసమానత పెరిగినా కొద్దీ యువతలో మానసిక ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంటున్నదని, బాలల్లో ఊబకాయం పెరుగుతున్నదని తెలిపింది. బాలల హక్కు పరిరక్షణ మొదలు హౌసింగ్, వారు వేసుకునే బట్టలు, భోజనం, సమాజంతో మమేకం కావాలన్న వారి ఆకాంక్షలు, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్న ఆకాంక్షలను బ్రిటన్‌లో తల్లిదండ్రులు అణచివేస్తున్నారని తెలుస్తున్నది. తమ అధ్యయన నివేదిక ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక వంటిదని సారా కుక్ గుర్తు చేశారు. వివిధ దేశాల ప్రభుత్వాలు బాలల్లో సుస్థిరత ప్రగతి లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని హెచ్చరించారు.
శిశు మరణాలు, ఆత్మహత్యల నివారణలో పురోగతి 
పిల్లల ఆకాంక్షలు నెరవేర్చడంలో తల్లిదండ్రుల వైఫల్యం
అయితే టీనేజ్ లోనే పిల్లలకు జన్మనివ్వడం, యువకుల ఆత్మహత్యలు, శిశు మరణాలు తదితర విభాగాల్లో సంపన్న దేశాల్లో పురోగతి సాధించినట్లు సర్వే నివేదిక తెలుపుతున్నది. జపాన్ లో ఒక శాతం మంది చిన్నారులకు ఆహారం పట్ల అభద్రత కొనసాగుతుండగా, మెక్సికోలో 37 శాతం మందికి ఈ సమస్య ఎదురవుతున్నది. పెద్దలు భారీగా ఆదాయాలు సంపాదిస్తున్నా, తమ పిల్లల ఆకాంక్షలకు అనుగుణంగా పౌష్టికాహారం అందజేయడంతోపాటు వారిని సంత్రుప్తి పరచడంలో విఫలమవుతున్నారని తేలింది. ప్రతి ఏడుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో సతమతం అవుతున్నారు. ఇటీవలి కాలంలో డెన్మార్క్‌లో ఈ పూర్తిగా దిగువ స్థానానికి పడిపోగా, కెనడా, మాల్టాల్లో 8 శాతానికి.. ప్రతి నలుగురిలో ఒకరు (11 - 15 ఏళ్ల మధ్య వయస్కులు) ఊబకాయం ఎదుర్కొంటున్నారు. ఇక డెన్మార్క్ 9 శాతం, జర్మనీలో 15, బ్రిటన్ లో 20, అమెరికాలో 29, రోమేనియాలో 39 మంది బాలలు ఆర్థిక అసమానత సమస్యతో సతమతం అవుతున్నారు.
బహుళ రూపాల్లో బాలల దైన్యం ఇలా 
వసతుల కల్పనలో అమెరికా, మెక్సికో లాస్ట్
బహుళ రూపాల్లో బాలలు స్విట్జర్లాండ్‌లో 11 శాతం, బ్రిటన్‌లో 34, రొమేనియాలో 85 శాతం బాలలు దారిద్ర్యం సమస్యను ఎదుర్కొంటున్నారు. దారిద్ర్య నిర్మూలనలో బ్రిటన్ 16వ స్థానంలో, ఆహార భద్రత కల్పనలో 34వ ర్యాంక్, వైద్య వసతుల కల్పనలో 15వ ర్యాంకులో ఉండగా, ఆర్థిక ప్రగతిలోనూ 31వ స్థానంలో నిలిచింది. బాలలకు వసతులు కల్పించడంలో నార్వే, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్ లాండ్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ దేశాలు మొదటి వరుసలో నిలుస్తుండగా, చిలీ, బల్గేరియా, రొమేనియా, మెక్సికో, అమెరికా చివరి స్థానాలకు పడిపోయాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com