ఎడారి దేశంలో సుజాత అనే మహిళకు కష్టం

- June 18, 2017 , by Maagulf
ఎడారి దేశంలో  సుజాత అనే మహిళకు కష్టం

కూతురు సుజాతను స్వదేశం రప్పించాలని తల్లి వేడుకోలు
కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్న బాధిత కుటుంబం
కష్టాల కడలిలో ఉన్న తన కుటుంబాన్ని గట్టేక్కించుకోవాలనే తపనతో వెళ్లి ఏడారి దేశంలో చిక్కుకుపోయిన ఒక మహిళ దీన గాధ ఇది.. దేవరపల్లి మండలంలోని దుమంతునిగూడెం పంచాయతీ శివారు గ్రామమైన సుబ్బరాయపురం గ్రామానికి చెందిన కడలి అర్జునరావు, కనకదుర్గ కుమార్తె సుజాత. భర్త చిట్టూరి శ్రీను ప్రమాదంలో మృతి చెందడం, రెండో పెళ్లి చేసుకుంటే భర్త పెడుతున్న చిత్రహింసలు తాళలేక సుజాత పుట్టింటికి వచ్చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి గుండె జబ్బుతో మంచాన పడటం.. కుమార్తె పావనిని చదివించలేకపోతున్నానన్న బెంగతో సమాధానంగా ఆమెకు ఎడారి దేశాలు కనిపించాయి. స్థానికంగా ఉంటున్న కొడవటి చిన్నోడు అనే వ్యక్తి ద్వారా కొవ్వూరుకు చెందిన ఏజెంట్‌ గెల్లా రాజ్‌కుమార్‌ను సంప్రదించింది. అప్పుచేసి రూ.70 వేలు రాజ్‌కుమార్‌కు ఇచ్చింది. 8 నెలల క్రితం రాజ్‌కుమార్‌ సుజాతను హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడి నుంచి సౌదీ తరలించాడు. ఒక షేక్‌ వద్ద పనికి కుదిర్చాడు. సుజాతను షేక్‌ నిత్యం వేధింపులకు గురిచేయడంతో బాధను ఫోన్‌ ద్వారా తన తల్లికి చెప్పుకునేది. 
తన కూతురు ప్రతి రోజూ బోరున ఏడుస్తూ ఫోన్‌ చేసినప్పుడు అమ్మా ఎప్పుడొస్తావ్‌ అంటూ విలపించేది. సౌదీలోని భారత ఎంబసీకి సమాచారం అందించామని తెలిపింది. అయితే తనకు లొంగకపోతే ఎడారిలోకి తీసుకెళ్లి చంపేస్తానని బెదిరిస్తున్నాడని తల్లికి కనకదుర్గ బోరున విలపిస్తూ తెలిపింది. పాస్‌పోర్టు జిరాక్సులు కూడా ఏజెంట్‌ తనకు ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. కుటుంబం సుజాతకోసం తల్లడిల్లిపోతోంది. జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలని కుటుంబం కోరుతోంది. దీనికి తోడు సుజాతను సౌదీ పంపించిన ఏజెంట్‌ కూడా తమను బెదిరిస్తున్నాడని సుజాత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com