ముస్లిం, మైనార్టీలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇఫ్తార్ వరాలు..

- June 18, 2017 , by Maagulf
ముస్లిం, మైనార్టీలకు తెలంగాణ సీఎం  కేసీఆర్‌ ఇఫ్తార్ వరాలు..

ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో కేసీఆర్‌ పాల్గొన్నారు. అంతకు ముందు నాంపల్లిలో ముస్లిం అనాధ పిల్లల ఆశ్రమానికి సీఎం శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనారిటీల విద్యా వికాసానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. త్వరలో ఢిల్లీ వెళ్లి ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో ముస్లింలకు ప్రభుత్వ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన ముస్లింల ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లిం కుటుంబాలకు సీఎం దుస్తులు పంపిణీ చేశారు. 
ముస్లిం మైనారిటీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు కేసీఆర్‌. ఎస్‌సీ, ఎస్‌టీలకు అమలు చేస్తున్నట్టుగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి నివేదించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సరికొత్త విధానాలతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని.. 17.18 శాతం అభివృద్ధితో అగ్రస్థానంలో ఉందని కేసీఆర్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లింలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించి ప్రోత్సహిస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు శాసనమండలిలో నలుగురు ముస్లింలకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌లలో ఐదుగురికి చైర్మన్‌గా అవకాశం ఇచ్చామన్నారు. విదేశాల్లో చదువుకునే ముస్లింలకు 20 లక్షలు చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 595 మందిని ఎంపిక చేసినట్టు సీఎం వివరించారు.
హైదరాబాద్‌లోనూ అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి విద్యావంతులు, మేధావులు.. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు కేసీఆర్‌ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్‌ విందుకు ముందు నాంపల్లిలో 20 కోట్లతో నిర్మించనున్న ముస్లిం అనాధ పిల్లల ఆశ్రమానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బిల్డింగ్‌ డిజైన్‌ను పరిశీలించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com