మెగాస్టార్ సినిమా కోసం హీరోయిన్ల వేట.. తెరపైకి బాలీవుడ్ భామల పేర్లు

- June 19, 2017 , by Maagulf
మెగాస్టార్  సినిమా కోసం హీరోయిన్ల వేట.. తెరపైకి బాలీవుడ్ భామల పేర్లు

మెగా ప్రాజెక్ట్ లో మెగాస్టార్ సరసన జతకట్టేదెవరు? చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ కోసం చాలా కసరత్తు చేస్తోంది యూనిట్. ఈ ప్రాసెస్‌లో చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో.. దీనికి అంతర్జాతీయ లుక్ ఇచ్చేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. దీంతో తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లతో పాటు.. బాలీవుడ్ భామలను కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు కసరత్తు చేస్తున్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్లు.
ఉయ్యాలవాడ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు చోటు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ అందాల బామ ఐశ్వర్య రాయ్‌ని తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంకా ఆమెతో చర్చించారా లేదా అనేది తెలియలేదు. తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఐశ్వర్య.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. నాగార్జున సరసన ఓ స్పెషల్ సాంగ్‌లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆమెను తమ సినిమాలోకి తీసుకుంటే.. ఇటు దక్షిణాదితోపాటు.. అటు బాలీవుడ్ లోనూ ఉయ్యాలవాడ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
ఐశ్వర్య రాయ్‌తోపాటు.. మరికొందరు బాలీవుడ్ భామల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రియాంక చోప్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో  ఉంది ప్రియాంకా. అటు హాలీవుడ్ స్థాయిలో కూడా ఆమె పేరు మారుమోగిపోతోంది. బే వాచ్ సిరీస్‌తో ఆమెకు హాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో బాజీరావ్ మస్తానీ వంటి బాలీవుడ్ చారిత్రక సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ అనుభవం ఉయ్యాలవాడ సినిమాకు కలిసొస్తుందని సినిమా యూనిట్ భావిస్తోంది. 
ఇక బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఫిలింనగర్ సమాచారం. గతంలో రజనీ సరసన లింగా సినిమాలో నటించిందీ భామ. తెలుగులో ఆమెతో నటింపజేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో ఆమెను తీసుకుంటే.. స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నారు. నటిగా కూడా ఆమెకు బాలీవుడ్,  కోలీవుడ్‌లో మంచి మార్కులే పడ్డాయి. కొంచెం ముద్దుగా.. కొంచెం బొద్దుగా.. అచ్చతెలుగు ఆడపడుచుగా ఆమె పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తోంది యూనిట్. 
ఇక ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా అనుష్కను తీసుకోవాలని చిరంజీవి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. రుద్రమదేవి, బాహుబలి సినిమాలతో చారిత్రక కథల్లో తానేంటో నిరూపించుకుంది అనుష్క. ఆమెను ఒక హీరోయిన్‌గా తీసుకుంటే.. సినిమాకు ప్లస్ అవుతుంది. గతంలో చిరంజీవితో కలసి స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్  చేసింది అనుష్క. అప్పటి నుంచి మెగాస్టార్ సరసన నటించే చాన్స్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడా అవకాశం అనుష్క తలుపుతట్టినట్టే అని భావిస్తున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతానికి ఈ పేర్లన్నీ పరిశీలనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ స్టామినాను మరోసారి చాటేందుకు అవసరమైన అన్ని హంగులు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తోంది యూనిట్. అయితే, చిరుతో తెరను పంచుకునేది ఎవరో త్వరలో తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com